సీనియర్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజబాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 1957 జూన్ 13న రాజబాబు జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో తెరంగేట్రం చేశారు.
ఆ తరువాత..సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు.
సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి తదితర సీరియల్స్‌లో నటించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకుగానూ ఆయన్ని నంది అవార్డు వరించింది. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు.