ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నటుడు, వైసీపీ నాయకుడు పృథ్వీరాజ్ ప్రకటించారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కుట్ర జరిగిందని, ఈ విషయాన్ని ముందే ఊహించానని కుట్ర చేసిన ప్రతిపక్షాలకు హేట్సాఫ్ అని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని విచారణ కమిటీ తేల్చిన తర్వాతే తిరిగి పదవి చేపడతానని పృథ్వీ అన్నారు. ఎస్వీబీసీకి మంచి పేరు తేవాలని కష్టపడి పనిచేశానని తెలిపారు. తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నారు. ఎస్వీబీసీకి సంబంధించి తాను ఒక్క రూపాయి కూడా తినలేదని, భోజనం కూడా తన సొంత ఖర్చులతోనే తినేవాడినని తెలిపారు.
సీఎం జగన్‌కు తాను దగ్గరవుతున్నాననే తనపై కుట్రలు చేశారని ఆరోపించారు. ఈ నెల 10న తనపై కొందరు దుండగులు దాడి చేసి పిడిగుద్దులు గుద్దినట్లు ఆరోపించారు. వేంకటేశ్వర స్వామి సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. పద్మావతి అతిథి గృహంలో మద్యం తాగినట్లు వస్తున్న ఆరోపణలు రుజువైతే చెప్పుతో కొట్టాలని అన్నారు. నేను నిజమైన రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని అన్నారు. బినామీ ముసుగులో ఉన్న కొందరు కార్పొరేట్ రైతులనే పెయిడ్ ఆర్టిస్టులు అన్నానని, ఒకవేళ నిజమైన రైతులు ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాటకు గౌరవించి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ తనది కాదని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పృథ్వీరాజ్ వెల్లడించారు.