నటుడు ప్రకాశ్ రాజ్ .. అయోధ్య-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎప్పటిలాగే జస్ట్ ఆస్కింగ్ హాష్ ట్యాగ్‌తో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘ అయోధ్యలో ఆలయం నిర్మిస్తారు. మసీదు కూడా నిర్మించవచ్చు గాక. కానీ ఇప్పటివరకు దీని చుట్టూ జరిగిన రక్తపాతం చాలు. మనిషి ప్రాణం చాలా విలువైనది. ఇకనైనా హింసను,రెచ్చగొట్టే ధోరణిని మనం ఆపలేమా..? మనుషుల ప్రాణాలపై దృష్టి సారించలేమా?’ అని వ్యాఖ్యానించారు.
కాగా, ఇంతకాలం వివాదాస్పద స్థలంగా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కి అప్పగిస్తూ సుప్రీం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.అక్కడ రామ మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అదే సమయంలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని ఇవ్వాలని సూచించింది. వివాదాస్పద స్థలం తమదేనని ముస్లిం సంస్థలు నిరూపించుకోలేకపోయాయని తెలిపింది. బాబర్ కాలంలో నిర్మించిన మసీదు.. ఖాళీ స్థలంలో నిర్మించింది కాదని వ్యాఖ్యానించింది. దాని కింద మరో మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంది. అయోధ్యను రాముడి స్థలం హిందువులు విశ్వసిస్తారని.. వారి విశ్వాసాలను కాదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. హిందువుల నమ్మకం నిజమైనదా కాదా అన్నది తేల్చడం కోర్టు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
#AYODHYAVERDICT ..Mandir wahi banega..Mazjid Ayodhya me hi banega ..enough blood has been spilt around this. Human life is precious .. shall we stop further violence and provocation ..shall we focus on precious human lives please #justasking
— Prakash Raj (@prakashraaj) November 9, 2019