శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి రూ.9 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని ఆ సంస్థ అధినేత, సినీ నటుడు మోహన్ బాబు ఆరోపించారు. ఇదే విషయంపై పలు పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా చొరవ చూపలేదన్నారు. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసిస్తూ ఆయన 10వేల మంది విద్యార్థులతో కళాశాల నుంచి తిరుపతి వరకు భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వీరు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో శుక్రవారం ఉదయం భారీగా పోలీసులు విద్యానికేతన్‌కు చేరుకున్నారు. అధినేత మోహన్ బాబును గృహ నిర్బంధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసన దీక్షలు చేపడతామని మోహన్ బాబు స్పష్టం చేశారు.