మెగా ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోగా నటించినా ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చే హిట్ ఒక్కటి కొట్టలేదు. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో ఈ సినిమా మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడుతుందా?
కథ:
హీరో అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) అలియాస్ అవి.. అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ మిలియనీర్ విద్యా ప్రసాద్ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్ బాలషణ్ముగం (భరత్)తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు. నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. కింది స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ మిలియనీర్‌గా మారిన విద్యా ప్రసాద్ తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ చేయాలనుకుంటాడు. విద్యా ప్రసాద్.. వెకేషన్ పేరుతో అవి, బాషా ఇద్దరినీ ఇండియాకు పంపిస్తాడు.
అలా ఇండియాకు వచ్చిన వారిద్దరిని నెలకు రూ. 5 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని చెప్తాడు. నెలకి తండ్రి పంపించే రూ. 5 వేలతోనే జీవితం గడపాల్సి వస్తుంది. డాలర్ల మధ్య పెరిగిన అవి నెల నెలా రూ. 5 వేలతో ఎలా నెట్టుకొచ్చాడు? బాషా (భరత్)తో ఒక బస్తీలో ఎలా జీవితాన్ని గడిపాడు? అతనికి డబ్బు విలువ ఎలా ఎప్పుడు తెలిసింది? అవికి లోకల్ పొలిటీషన్ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? ఈ ప్రయాణంలో నేహా (రుక్సార్) అనే అమ్మాయితో అవికి ఎలా అనుబంధం పెరిగింది? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
నటీనటులు :
అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. కథానాయిక రుక్సార్ ధిల్లన్ అందంగా కనిపించింది తప్ప ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యంలేదు. హీరో తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. విలన్‌గా సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా నటించారు. యువ రాజకీయనాయకుడి పాత్రలో ఆయన కనిపించిన విధానం బాగుంది. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అమెరికాలో డాలర్లు ఖర్చుపెడుతూ జల్సాగా తిరిగిన కుర్రాడికి సడన్‌గా చేతిలో చిల్లిగవ్వలేకుండా పోతే.. తాను ఎదుర్కొనే పరిస్థితులను మరింత కామెడీ, ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా తీసుకున్నాడు. కథలో బలమైన సంఘర్షణ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లినట్టే అనిపిస్తుంది కానీ సినిమాలో ఎలాంటి వినోదం పండదు. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్లోనూ సహజత్వం లేదు. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది.
సాంకేతికంగా సినిమా బాగుంది. రామ్ సినిమాటోగ్రఫీ, జుదా సాందీ సంగీతం బాగుంది. సినిమా స్థాయికి తగ్గట్టే నిర్మాణ విలువలు ఉన్నాయి. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్‌లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్‌ఫుల్‌గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్ రామ్. దర్శకుడు రచనా పరంగా అక్కడక్కడా పర్వాలేదనిపించాడంతే. కథ, కథనాల విషయంలో ఆయన చేసిన కసరత్తులు ఏమాత్రం సరిపోలేదు. కథ విషయంలో పలువురు దర్శకుల సలహాలు తీసుకున్నా ఆ ప్రభావం సినిమాపై పెద్దగా కనిపించలేదు.
టైటిల్ : ఏబీసీడీ
నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ ధిల్లన్, భరత్, నాగబాబు తదితరులు
సంగీతం: జుదా సాందీ
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
సంస్థ: మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
హైలైట్స్
సినిమాటోగ్రఫి
వెన్నెల కిషోర్ కామెడీ
డ్రాబ్యాక్స్
సరైన హాస్యం లేకపోవడం
కథలో బలమైన సంఘర్షణ లేకపోవటం
చివరిగా : సాదాసీదాగా ఏబీసీడీ
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)