బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తాజాగా తన మానసిక ఒత్తిడికి సంబంధించిన వీడియో సందేశాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడారు. “నాకు అన్నీ సౌకర్యాలు దొరికాయి. అయినా నా మానసిక ఒత్తిడికి గల కారణాలపై అన్వేషణ చేస్తున్నా సమాధానం దొరకడం లేదు. అంతే కాకుండా మూడున్నరేళ్ల క్రితం నా ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు.. నేను ఏదో విషయంపై దీర్ఘంగా ఆలోచిస్తుండేదాన్ని, ఒంటరిగా గదిలో ఉండేదాన్ని. కానీ తర్వాత దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిసింది.
నా తల్లిదండ్రులు విడాకులు తీసుకునేటప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఆ విషయం నన్నంతగా బాధపెట్టలేదు. ఎందుకంటే, నా కోసం వారెప్పుడూ అండగా నిలిచారు. ఆరేళ్ల వయసులో క్షయ వచ్చినప్పుడు కూడా బాధపడలేదు. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యాను. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో నాకు తెలిసేది కాదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు నాకు ఆ పరిస్థితి ఎదురయ్యేది. ఏడాది తర్వాత నాకు విషయం అర్థమైంది. మెయిల్ ద్వారా విషయాన్ని నా తల్లిదండ్రులకు తెలియజేసి సమస్య నుండి బయటపడ్డాను. ఈ సమస్య కూడా నాపై పెద్దగా ప్రభావం చూపలేదు” అని చెప్పింది ఐరా. అయితే తన మానసిక ఒత్తిడికి గల కారణాలను మాత్రం చెప్పలేదు.