బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు . చాలాకాలంగా ఆయన త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని, బీజేపీ తో చేతులు కలపనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయం గురించి ఆదివారం ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా ఛానల్ నిర్వహించిన ‘యువ’ అనే కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడారు. తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టత ఇచ్చారు.
‘నేను సినీ నటుడ్ని. కానీ ప్రజలకు ఓ రాజకీయ నాయకుడు చేసేంత సేవ.. క్రియేటివిటీ ఉన్న నేను చేయలేను. నా ప్రతిభే నా బలం. నేను కమ్యూనికేటర్‌ను. నా ప్రతిభతో ప్రజల హృదయాలను గెలుచుకోగలను. నాకు రాజకీయాలంటే భయం. నాకే కాదు రాజకీయాలంటే ఎవరికి భయం లేదు? అందుకే వాటికి నేను దూరంగా ఉంటాను. సమాజంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల గురించి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. ప్రభుత్వమే మనకు సమాధానం చెప్పాలి. అందులో ఏమాత్రం సందేహం లేదు.’ అని వెల్లడించారు.
అనంతరం తాను ‘పానీ’ పేరిట స్థాపించిన స్వచ్ఛంద సంస్థ గురించి మాట్లాడుతూ..’మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా నా సంస్థకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇది నా ఒక్కడి వల్లో లేక ప్రభుత్వం వల్లో జరిగే పని కాదు. ప్రజలందరూ కలిసి ఓ ఉద్యమంలా ఏర్పడితేనే మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను కరవు రహితంగా మార్చగలం’ అని అమీర్ ఖాన్ పేర్కొన్నారు