టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం ‘బ్లాక్’. జి.బి. కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం (మే 21) ‘బ్లాక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది.’ అంటూ ఆది చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
ట్రైలర్‌లో డైలాగ్‌లు అన్నీఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆది పోలీస్‌గా అలరించనున్నాడు. బిగ్‌బాస్-2 టైటిల్ విన్నర్ కౌశల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మూవీ ఒక రాబరీ, ఒక దొంగతనం చుట్టూ తిరిగే కథాంశంగా ఉంది. ‘విభిన్నమైన కథ, కథానాలతో రూపొందుతున్న చిత్రమిది. ఆది నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.’ అని చిత్రబృందం తెలిపింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీలో దర్శనబానిక్, ఆమని, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు.