HomeTelugu Reviewsఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ

ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ రివ్యూ

Aadavallu Meeku Joharlu Review

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్‌ టాక్‌ రావడంతో పాటు సినిమాపై అంచనాలను క్యూరియాసిటీని పెంచేసింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు (శుక్రవారం మార్చి- 4)ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

కథ: ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన చిరంజీవి అలియాస్‌ చిరుకి(శర్వానంద్‌)ఏజ్‌ బార్‌ అయినా.. ఇంకా పెళ్లి కాదు. తనతో పాటు తన కుటుంబం మొత్తానికి నచ్చే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన లక్ష్యం. అయితే కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి చూపులకు వెళ్లి వచ్చిన ప్రతి అమ్మాయిని ఏదో ఒక వంక చెప్పి రిజెక్ట్‌ చేస్తారు. దీంతో తన జీవితంలో ఇక ‘మాంగళ్యం తంతునానేనా ‘ అనే మంత్రాన్ని ఉచ్చరించనేమోనని బాధపడుతున్న క్రమంలో ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆద్యకు కూడా చిరుపై ప్రేమ ఉన్నప్పటికీ.. అతని ప్రపోజ్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. దానికి కారణం తన తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే నచ్చకపోవడం. వకుళను ఒప్పిస్తేనే ఆద్య తనకు దక్కుతుందని భావించిన చిరు.. ఓ చిన్న అబద్దం చెప్పి ఆమెకు దగ్గరవుతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు వకుళకు పెళ్లి అంటే ఎందుకు నచ్చదు? ఆమె నేపథ్యం ఏంటి? చివరకు చిరు, ఆద్యలు ఎలా ఒక్కటయ్యారనేదే కథలో అంశం.

నటీనటులు : ఉమ్మడి కుటుంబంలో పెట్టి పెరిగిన యువకుడి పాత్రలో శర్వానంద్‌ ఆకట్టుకున్నాడు. వధువు కోసం అన్వేషించి, విసిగిపోయిన ఏజ్‌ బార్‌ బ్యాచిలర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఆద్య పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. హీరో తల్లి ఆదిలక్ష్మీగా రాధిక పర్వాలేదనిపించింది. పద్మమ్మగా ఊర్వశి తనదైన కామెడీతో నవ్వులు పూయించింది. ఇక హీరోయిన్‌ తల్లి వకుళ పాత్రకు ఖుష్భూ న్యాయం చేసింది. సినిమాలో చాలా బలమైన పాత్ర తనది. హీరో స్నేహితుడిగా వెన్నెల కిశోర్‌ ఎప్పటి మాదిరే తనదైన పంచ్‌ డైలాగ్స్‌తో నవ్వించాడు. పెళ్లి కూతురు తండ్రి బుజ్జిగా బ్రహ్మానందం తళుక్కున మెరిసి వెళ్లాడు. మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

sarwa

విశ్లేషణ: రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు, శర్వానంద్‌ లాంటి టాలెంటెడ్‌ హీరో, రష్మిక లాంటి బ్యూటిఫుల్‌ హీరోయిన్‌.. వీళ్లంతా కలిసి నటించిన చిత్రం కావడంతో తొలి నుంచి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కొత్తదనం కొరవడింది. రోటీన్‌ స్టోరీకి కామెడి, ఎమోషన్స్‌ని జోడించి ‘ఆడవాళ్లు జోహార్లు’ సినిమాను తెరకెక్కించాడు కిశోర్‌ తిరుమల. చెప్పుకోవడానికి పెద్ద పేరున్న నటీ,నటులను తీసుకున్నాడు తప్పా.. వారి పాత్రలకు తగిన ప్రాధాన్యత మాత్రం సినిమాలో లేదు. ఉన్నంతలో ఖుష్బు పాత్ర పర్వాలేదు.

గత సినిమాలే మాదిరే సున్నితమైన హాస్యభరితమైన సన్నివేశాలతో ఫస్టాఫ్‌ అంతా కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. పెళ్లి కోసం హీరో పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. అలాగే వెన్నెల కిశోర్‌ కామెడీ కూడా నవ్వులు పూయిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీని వెనక్కినెట్టి.. ఎమోషన్స్‌ని ముందుకు తీసుకోచ్చాడు దర్శకుడు. అయితే అది వర్కౌట్‌ కాలేదు. పాత సినిమాలే మాదిరే.. హీరోయిన్‌ ప్యామిలీని ఒప్పించడానికి హీరో.. హీరోయిన్‌ ఇంటికి వెళ్లడం, క్లైమాక్స్‌లో నిజం తెలిసి పోవడం, చివరకు వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడం.. ఇలానే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ సాగుతుంది.

సెకండాఫ్‌లో ప్రతి చోట.. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ‘నేను శైలజ’ ఛాయలు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగుతుంది. అలా అని పూర్తిగా బోర్‌ కొట్టించే చిత్రం అయితే కాదు. కానీ కొత్తదనం మాత్రం ఆశించొద్దు. ఊర్వశితో వచ్చే ‘టిఫిన్‌ బాక్స్‌’జోక్‌ అయితే థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కిశోర్‌ తిరుమల డైలాగ్స్‌ ఆకట్టుకోవడమే కాదు.. ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక సాంకెతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. చక్కటి నేపథ్య సంగీతం అందించాడు. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

టైటిల్‌ : ఆడవాళ్లు మీకు జోహార్లు
నటీనటులు : శర్వానంద్‌, రష్మిక, ఖుష్భూ, రాధిక, ఊర్వసి, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు
దర్శకత్వం:  శోర్​ తిరుమల
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌
నిర్మాత: ధాకర్​ చెరుకూరి
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌

హైలైట్స్‌‌: నటీనటులు
డ్రాబ్యాక్స్‌: కథలో కొత్తదనం లేకపోవడం

చివరిగా: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కుటుంబం అంతా కలిసి చూడోచ్చు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu