తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదర్శ బాలకృష్ణ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణవంశీ గురించి ప్రస్తావించాడు. “కృష్ణవంశీ దర్శకత్వంలో నేను ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేశాను. ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం రావడాన్ని ఆర్టిస్టులు అదృష్టంగా భావిస్తారు. అలాంటిది ఆయన సినిమాలో నటించినన్ని రోజులు నేను తిట్లు తింటూనే వచ్చాను.
‘నీకు నటన రాదు .. నువ్వెందుకు పనికి రావు’ అంటూ ఆయన ఒక రేంజ్ లో తిట్టేవారు. ఆ మాటలు చాలా అవమానకరంగా అనిపించినప్పటికీ, చాలా సహనంతో భరిస్తూ వచ్చేవాడిని. నా నుంచి మంచి నటనను రాబట్టడం కోసమే ఆయన అలా అంటున్నారని భావించాను. షూటింగు జరుగుతున్నప్పుడుగానీ.. ఆ తరువాతగాని ఆయనపై నాకు కోపం రాలేదు. ఇప్పుడు ఆయనతో మంచి స్నేహం కుదిరింది. కలిసినప్పుడల్లా సరదాగా మాట్లాడుకుంటాము. ఆయన నన్ను తిట్టిన తిట్లను నేను గుర్తుచేస్తుంటే, నాతో పాటు కలిసి ఆయన నవ్వుతుంటారు” అని చెప్పుకొచ్చాడు.