తెలుగు ప్రజలంతా నేడు ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లడానికి కూడా అనుమతి లేకపోవడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఎలాంటి ఆర్భాటం లేకుండానే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం లేదనే చెప్పాలి. దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించడంతో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా యుద్ధం చేస్తున్నారు. దేశమంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ‘ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రజలకు గుడి పడ్వా, కశ్మీర్ ప్రజలకు నవ్‌రే, కర్ణాటక ప్రజలకు ఉగాది, మణిపూర్ వాసులకు సజిబు శైరోబా పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పీడిస్తోందని తెలిపారు. పండుగ సమయంలోనూ ప్రజలు కరోనాతో పోరాటం చేస్తున్నారని అన్నారు. సాధారణంగా ఎప్పటిలా ఈ పండుగలు జరుపుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవని ప్రధాని మోదీ అన్నారు. అంతే కాకుండా ఈ పర్వదినాలు మనలోని మనోస్థయిరాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. కరోనా కట్టడికి 24 గంటల పాటు తీవ్రంగా శ్రమిస్తున్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది.
ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను.— Narendra Modi (@narendramodi) March 25, 2020