తమిళ హిట్ ’96’ సినిమా తెలుగు రీమేక్‌లో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. తమ ప్రొడక్షన్లో వస్తోన్న 34వ చిత్రం ఇది అని తెలిపింది. చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. మార్చిలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ’96’ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని చాలా రోజుల క్రితమే సొంతం చేసున్నారు. ఇన్నాళ్లూ సరైన నటుల కోసం చూసిన యూనిట్ శర్వా, సమంతను ఎంచుకుంది. సమంత ఇందులో నటించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆమె ట్విటర్లో స్పందిస్తూ.. ‘త్రిష పాత్రను మరొకరు చేయకూడదు’ అని చెప్పారు. ఆగస్టులో తెలుగు రీమేక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
’96’లో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతోపాటు సినీ ప్రముఖుల మెప్పు పొందింది. పాఠశాలలో త్రిష, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం.. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం.. మళ్లీ ఓ సందర్భంలో కలుసుకోవడం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.