విశాఖ విమానాశ్రయంలో ఓ యువకుడు చేసిన కత్తి దాడిలో గాయపడ్డ వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జగన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా తమ వైద్య సిబ్బంది సాయంతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఆయన భుజంపై కత్తి గాయమైందని, ప్రాథమికంగా శస్త్రచికిత్స చేసినట్టు వెల్లడించారు. గాయం 3 నుంచి 4 సెం.మీల లోతులో కండరానికి దెబ్బ తగిలిందని తెలిపారు. ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
కత్తికి ఏమైనా విషపూరితమైన పదార్థం ఉందా అనే అనుమానంతో నమూనాలను పరీక్షలకు పంపామని వైద్యులు తెలిపారు. జగన్‌కు 9 కుట్లు వేశామని, ఆయన ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. వైద్య నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి జగన్ ధైర్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.