నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా కూడా ఆయన యూత్ మెచ్చే సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. కాకపోతే ఈ సారి ఆయన ప్రేమకి కాస్త ఎక్కువ రొమాన్స్ ను జోడించారు. అలా వచ్చిన ‘డర్టీ హరి’ యూత్ ను కొంతవరకూ ఆకట్టుకోగలిగింది. తాజాగా ఆయన సొంత బ్యానర్లో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
చాలావరకూ కొత్తవారినే ఈ సినిమా కోసం తీసుకున్నారు. కొంతవరకూ షూటింగు జరిగిన తరువాత, కరోనా కారణంగా బ్రేక్ పడ్డింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుగుతోంది. ఈ సినిమాతో గొల్లపూడి సమర్థ్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను సుమంత్ అశ్విన్ – ఎస్ రజినీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.