Homeతెలుగు Newsతాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయం

తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయం

పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం ఒకటి. జిల్లా వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం రాజకీయాల్లో కొత్తవారికి ఎప్పుడూ అవకాశాలు తెరిచే ఉంటాయి. లక్షా 81 వేల మంది ఓటర్లుండే ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ. తాడేపల్లిగూడెం నుంచి 1999లో టీడీపీ 2004లో కాంగ్రెస్, 2009లో పీఆర్పీ, 2014లో బీజేపీ విజయం సాధించాయి. గత ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షంగా బీజేపీ తరపున బరిలోకి దిగిన మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. కాపు నాయకుడు కావడం, బీజేపీ, టీడీపీని పవన్ కల్యాణ్ బలపచడంతో కొత్త అభ్యర్థియైనా గూడెం ప్రజలు మాణిక్యాలరావును గెలిపించారు. నిన్నటి వరకూ బీజేపీ, టీడీపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తాడేపల్లిగూడెంలో మాత్రం ఇరు పార్టీలు బద్ధశత్రువుల్లా వ్యవహరించారు. జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాణిక్యాలరావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మిత్రపక్షాలుగా ఉంటూనే గూడెంలో రెండు పార్టీల నేతల గొడవలతో రాజకీయం వేడెక్కుతూ వచ్చింది. చివరికి టీడీపీ, బీజేపీ మధ్య తెగదెంపులతో మాణిక్యాలరావు మంత్రి పదవికి రాజీనామా చేశారు.

12 14

కలిసున్నప్పుడే కలహాల కాపురం చేసిన టీడీపీ-బీజేపీ ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మాణిక్యాలరావు మరోసారి బీజేపీ నుంచి పోటీ చేసినా గెలవగలరా అన్నదే ప్రశ్న. టీడీపీతో సంబంధాలు తెగిపోవడం, మరోవైపు జనసేన కాపు ఓటర్లను ఆకట్టుకునే అవకాశాలుండటంతో మాణిక్యాలరావు ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. గూడెంలో టీడీపీకి మంచి పట్టు ఉండటంతో 2014లో బీజేపీ విజయం ఖాయమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాపులు ఎటుమొగ్గుతారో చెప్పలేము. పైగా పార్టీకి తాడేపల్లిగూడెంలో చెప్పుకోదగ్గ అభ్యర్థి లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. వైసీపీ గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి సమీకరణాలు కలిసొస్తాయనే అంచనాలో ఉంది. 1994 నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న కొట్టు సత్యనారాయణ 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు నాయకుడైన కొట్టు తాడేపల్లిగూడెం వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు చెప్పారు. మాజీ ఎమ్మెల్యేగా, కాపు నేతగా కొట్టు సత్యనారాయణ జనంలోకి వెళ్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన బోణీ కొట్టబోయేది తాడేపల్లిగూడెంలోనే అని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 2009లో పీఆర్పీకి ప్రజలు ఏవిధంగా బ్రహ్మరథం పట్టారో.. ఈసారి జనసేనకు అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని ఆశతో ఉన్నారు. జనసేన నుంచి టీడీపీ నేత, మాజీమంత్రి యర్రా నారాయణస్వామి కొడుకు నవీన్ పోటీకి దిగబోతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ, బీజేపీ వైరానికి తోడు జనసేన బరిలో ఉండటంతో సమీకరణాలు మారే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే
తాడేపల్లిగూడెంలో వైసీపీ పుంజుకున్నట్టు కనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu