ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గతంలో నమోదైన క్లస్టర్ల నుంచే ఎక్కువగా బయటపడుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో పాత క్లస్టర్లలోనే 40 కేసులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 955 కరోనా పాజిటివ్ కేసుల్లో 642 కేసులు కేవలం 4 జిల్లాల్లోనే బయటపడినట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో 8 కొత్త క్లస్టర్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు జవహర్ రెడ్డి ప్రకటించారు. 566 మండలాలు గ్రీన్ జోన్‌లో ఉన్నట్టు తెలిపారు. కరోనా కేసులున్న మండలాలు 110కి చేరినట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్న 5 రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54,341 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గత 24 గంటల్లో 6,306 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించారు.