లోకనాయకుడు కమల్ హాసన్ తన నటన జీవితాన్ని ప్రారంభించి 60 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి చెన్నైలో భారీ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ వేడుకలో పాల్గొని కమల్‌హాసన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇళయరాజా సారథ్యంలో నిర్వహించిన సంగీత కచేరీ శ్రోతలను విశేషంగా అలరించింది. కమల్‌హాసన్ కూడా ఇందులో గొంతు కలపడం విశేషం. ఈ ఉత్సవంలో మ్యూజిక మేస్ట్రో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్ దర్శకుడు కేఎస్ రవికుమార్, నటుడు పార్తీబన్, విజయ్ సేతుపతి, కార్తీ, తమన్నాతదితరులు సందడి చేశారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు రాజ్‌కమల్ ఫిల్మ్స్ అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
1960లో ‘కలతూర్ కన్నమ్మ’ చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన కమల్‌హాసన్ దాదాపు 200 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. తమిళంతో పాటు, మలయాళం, తెలుగు, హిందీ, బెంగాలీ చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటించి మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా, నృత్య కళాకారుడిగా, దర్శకుడిగా తనలోని ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఇక ఇప్పుడు బుల్లితెర రియాల్టీ షో తమిళ బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు. ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీని స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వెండితెరకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు2’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కమల్‌కు జోడీగా కాజల్ నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.