నటీనటులు: తరుణ్, ఓవియా తదితరులు
సంగీతం: శ్రీనాథ్ విజయ్
ఛాయాగ్రహణం: క‌్రిస్టోఫర్ జోసెఫ్
కూర్పు: శంకర్
నిర్మాత: ఎస్.వి.ప్రకాష్
దర్శకత్వం: రమేష్ గోపి
లవర్ బాయ్ తరుణ్ నటించిన లాంగ్ గ్యాప్ తరువాత నటించిన ‘ఇది నా లవ్ స్టోరీ’ సినిమా ప్రేమికులరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
అభిరామ్(తరుణ్) తన చెల్లెలు కోరిక మేరకు శ్రుతి అనే అమ్మాయిని పెళ్లి ప్రపోజల్ మీద చూడడానికి అరుకు వెళ్తాడు. దారి మధ్యలో అభి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు.
శ్రుతి ఇంటికి వెళ్లి చూడగానే అక్కడ తను ఇష్టపడిన అమ్మాయి కనిపిస్తుంది. తనను శ్రుతి అని పరిచయం చేసుకుంటుంది. ఒకరితో ఒకరు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. తన గురించి తెలిసిన తరువాత అభి ఆమెను మరింతగా ఇష్టపడతాడు. ఇంతలో తను శ్రుతి కాదని అభినయ(ఓవియా) అని తెలుసుకుంటాడు అభి. ఇంతకీ ఈ
అభినయ ఎవరు..? శ్రుతి అని చెప్పి అభికి ఎందుకు దగ్గరైంది..? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
ఇంటర్వెల్ బ్యాంగ్
నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
డైలాగ్స్
సాగతీత
విశ్లేషణ:
కన్నడలో సక్సెస్ అయిన ‘సింపుల్ ఆగి ఒందు లవ్ స్టోరీ’కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక లవ్ స్టోరీను తెరపై ఆవిష్కరించాలంటే ఇద్దరు ప్రేమికుల మధ్య ఎమోషన్స్, కెమిస్ట్రీ అనేది కీలకం. కానీ ఈ సినిమాలో అదే లోపించింది. ప్రాసల కోసం పరుగులు తీస్తూ త్రివిక్రమ్ ను బీట్ చేయాలని ప్రయత్నించిన డైలాగులు సినిమాకు పెద్ద మైనస్ గా మారాయి. సన్నివేశానికి ఏమాత్రం సింక్ కానీ సంభాషణలతో విసిగించారు. ఫస్ట్ నైట్, బిస్కెట్లు అంటూ పిచ్చి పిచ్చి మాటలతో ప్రేక్షకులను అసహనానికి గురి చేసారు. ఫస్ట్ హాఫ్ ఎంత విసిగించిందో సెకండ్ హాఫ్ దానికి మించి ఉంటుంది. ఇక పతాక సన్నివేశాల గురించి మాట్లాడకపోవడమే మంచిది. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం హీరో, హీరోయిన్ల నటన ఆకట్టుకునే విధంగా ఉండకపోవడంతో ఈ సినిమా ఆడియన్స్ కు ఎంతమాత్రం కనెక్ట్ అవ్వదు. టెక్నికల్ గా కూడా సినిమా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ కొంచెం బాగుంది. పాటలు బాలేవు. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు ఆల్రెడీ హిట్ అయిన కథను ఎన్నుకొని అదే కథను తెలుగులో డీల్ చేయలేక తడబడ్డాడు.
రేటింగ్: 1/5