HomeTelugu Reviews2.ఓ మూవీ రివ్యూ

2.ఓ మూవీ రివ్యూ

సూపర్‌ స్టార్‌ ర‌జ‌నీకాంత్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కినిన చిత్రం ‘రోబో 2.ఓ’.. నాలుగేళ్ల పాటు శ్ర‌మించి, ఏకంగా అయిదు వంద‌ల కోట్ల‌కుపైనే పెట్టుబ‌డి పెట్టి ఓ సినిమా తీశారంటే ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది? ర‌జ‌నీ అభిమానులు ఎక్క‌డా నిరుత్సాహ ప‌డ‌కుండా ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్ష‌ణ ఫ‌లించింది. 2.ఓ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ర‌జ‌నీ – శంక‌ర్ స్థాయికి త‌గ్గ‌ట్టు సాగిందా? రోబోతో పోలిస్తే 2.ఓలో ఉన్న ప్ర‌త్యేక‌త‌లేంటి?

1 28

క‌థ: చెన్నైలో ఉన్నట్టుండి అంద‌రి సెల్‌ఫోన్లూ మాయ‌మైపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్‌ని చీల్చుకుంటూ మ‌రీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గ్ర‌హిస్తారు. ఇంత‌లో సెల్‌ఫోన్‌ల‌న్నీ అమ‌ర్చుకున్న ఓ ప‌క్షి ఆకార‌పు రూపం న‌గ‌రంలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దింపాల‌ని భావిస్తారు. వశీక‌ర్ (ర‌జ‌నీకాంత్‌) ఆ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతం అవుతాడు. అలా చిట్టి మ‌ళ్లీ రంగ ప్ర‌వేశం చేసి – అత్యంత బ‌ల‌మైన ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్‌)ని ఎలా ఎదుర్కొంది? అస‌లు ఆ ప‌క్షిరాజు క‌థేమిటి? అనేది తెలియాలంటే 2.ఓ చూడాల్సిందే.

నటీనటులు: ఈ వ‌య‌సులోనూ ఇలాంటి విన్యాసాలు చేయ‌డం, జోరుగా స్టెప్పులేయ‌డం ర‌జ‌నీకే చెల్లింది. త‌న ఎజ్‌కి, స్టైల్‌కి మ‌రోసారి సెల్యూట్ చేయాల్సిందే. అయితే కొన్ని చోట్ల డూప్‌తో లాగించేసిన‌ట్టు అర్థ‌మైపోతుంటుంది. పైగా.. ఏది విజువ‌ల్ ఎఫెక్ట్స్ ర‌జ‌నీకాంతో, ఏది నిజ‌మైన ర‌జ‌నీనో తెలీక క‌న్‌ఫ్యూజ్ అవుతారు. అక్ష‌య్ ప‌రిస్థితీ అంతే. ఆయ‌న ప‌క్షిరాజుగా క‌నిపించింది ఎక్కువ‌. నిజ‌మైన రూపాన్ని చూసే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా వ‌చ్చింది. అయితే… అక్ష‌య్ గెట‌ప్ బాగుంది. అమీజాక్స‌న్‌ని మిన‌హాయిస్తే… తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిన న‌టీన‌టులెవ‌రూ క‌నిపించ‌రు. శంక‌ర్ ఈ సారి క‌థ‌ని ర‌జ‌నీ – అక్ష‌య్‌ల పోరాటం మ‌ధ్యే తిప్ప‌డంతో మిగిలిన పాత్ర‌లు తేలిపోయాయి.

సాంకేతికంగా ఉన్న‌తంగా ఉందీ చిత్రం. విజువ‌ల్ ఎఫెక్ట్స్ మ‌రీ హాలీవుడ్ స్థాయిలో లేవు గానీ… మ‌న తెలుగు ప్రేక్ష‌కుల్ని మాత్రం అబ్బుర‌ప‌రుస్తాయి. త్రీడీలో చూడ‌గ‌లిగితే… ఆ ఎఫెక్ట్స్ మ‌రింత బాగుంటాయి. కాక‌పోతే ఆర్‌.ఆర్‌లో రెహ‌మాన్ మార్క్ క‌నిపించింది. ప్ర‌తీసారీ బ‌ల‌మైన క‌థ‌ని ఎంచుకుంటూ సినిమాలు తీసే శంక‌ర్ ఈసారి కేవ‌లం టెక్నాల‌జీకే పెద్ద పీట వేశాడు. దాంతో తెరంతా భారీ హంగుల‌తో మెరిసిపోతుంటుంది. కానీ.. భావోద్వేగాలు ఇంకాస్త పండాల్సింది.

1a 3

విశ్లేషణ: శంక‌ర్ ఎప్పుడూ సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్న‌తంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విష‌యాన్నే ఎంచుకోవ‌డం మ‌రింత క‌లిసొచ్చింది. 2.ఓ విష‌యంలో ఆయ‌న సెల్‌ఫోన్‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు. సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, భ‌విష్య‌త్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుందో.. ఈ సినిమాలో క‌ళ్ల‌కు క‌ట్టారు. వాటి చుట్టూ ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ క‌థ అల్లారు. ప్ర‌ధ‌మార్ధంలో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్ర‌వేశం చేస్తాడో.. అప్పుడు ఓ ర‌స‌వత్త‌ర‌మైన పోరు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. ప‌క్షిరాజుగా అక్ష‌య్ ని చూపించ‌డంతో విశ్రాంతి కార్డు ప‌డుతుంది.

ద్వితీయార్ధం మొత్తం చిట్టి – ప‌క్షిరాజుల ఆధిప‌త్య పోరే చూపించారు. అస‌లు ప‌క్షిరాజు క‌థేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విష‌యాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృద‌యాన్ని హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు. అస‌లు ఈ సినిమాలో ఎమోష‌న్ పండింది అంటే… ఈ ఒక్క ఎపిసోడ్ లోనే. ప‌తాక స‌న్నివేశాల్ని విజువ‌ల్‌గా ఓ స్థాయిలోకి తీసుకెళ్లాడు శంక‌ర్‌. కొన్ని స‌న్నివేశాలు రోబోలో చూసిన‌ట్టే అనిపిస్తుంటాయి. ప్ర‌చార చిత్రాలు చూసిన‌వాళ్ల‌కు ఈ సినిమా క‌థ‌పై ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డి ఉంటుంది. వాటికి లోబ‌డే సినిమా ఉంటుంది.

క‌థ ప‌రంగా.. ద‌ర్శ‌కుడు అద్భుతాలేం చూపించ‌లేదు. త‌న దృష్టంతా ఈ సినిమాని విజువ‌ల్ వండ‌దర్‌గా తీర్చిదిద్ద‌డంపైనే సాగింది. కొన్ని స‌న్నివేశాల్లో గ్రాఫిక్స్ అబ్బుర‌ప‌రుస్తాయి. అయితే… శంక‌ర్ ఈ కథను ఎమోష‌న‌ల్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. భావోద్వేగాల‌న్ని బ‌లంగా రాబ‌ట్టుకొనే శంక‌ర్‌… ఆ విష‌యంలో కాస్త లోటు చేశాడేమో అనిపిస్తుంది. కానీ, విజువల్‌గా శంకర్‌ వండర్‌ సృష్టించాడు. చివరి 30 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 3డీలో చూస్తే ‘2.ఓ’కు శంకర్‌ పడిన కష్టం స్పష్టం తెలుస్తుంది. ఇక ఇందులో 3.ఓ మినీ రోబోగా రజనీ నటన చిన్నారులను అలరిస్తుంది. అయితే, రోబోలో ఐశ్వ‌ర్య రాయ్ లాంటి స్టార్ నాయిక ఉండ‌డంతో ఆ పాత్ర‌కు వెయిటేజ్ ఇవ్వ‌గ‌లిగాడు. ఈసారి… ఐష్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది.

1b 1

హైలైట్స్
రజనీ, అక్షయ్‌ల నటన
గ్రాఫిక్స్

డ్రాబ్యాక్స్
ఎమోష‌న్స్‌లో బలం లేకపోవడం

చివరిగా : ‘2.ఓ’ శంకర్‌ మ‌రో మాయాజాలం
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్ : 2.ఓ
నటీనటులు : రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌ తదితరులు
సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌
దర్శకత్వం : శంకర్‌
నిర్మాత : సుభాస్కరణ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

సూపర్‌ స్టార్‌ ర‌జ‌నీకాంత్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కినిన చిత్రం 'రోబో 2.ఓ'.. నాలుగేళ్ల పాటు శ్ర‌మించి, ఏకంగా అయిదు వంద‌ల కోట్ల‌కుపైనే పెట్టుబ‌డి పెట్టి ఓ సినిమా తీశారంటే ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది? ర‌జ‌నీ అభిమానులు ఎక్క‌డా నిరుత్సాహ ప‌డ‌కుండా ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్ష‌ణ ఫ‌లించింది. 2.ఓ వ‌చ్చేసింది. మ‌రి...2.ఓ మూవీ రివ్యూ