అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. అనూహ్య విజయం సాధించి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘నాట్టమై’ ఆధారంగా పెదరాయుడు చిత్రం తెరకెక్కింది. ఒరిజినల్ కంటే కూడా అద్భుతంగా రూపొందించిన ఈ పెదరాయుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా.. ఆ ఏడాది విడుదలైన సినిమాల్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
పెదరాయుడు సినిమా తెలుగులో తెరకెక్కేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ ముఖ్య కారణం. తమిళంలో విజయం సాధించిన నాట్టమై చిత్రం నిర్మాత ఆర్‌బీ చౌదరి నుంచి తెలుగులో నిర్మించేందుకు మోహన్‌బాబుకు రైట్స్ ఇప్పించారు రజనీకాంత్. అంతేకాకుండా ఈ సినిమాలో రజనీకాంత్ నటించిన పాపారాయుడు పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఆ రోజుల్లో మహా నటులు సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా పెదరాయుడు సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
పెదరాయుడు విడుదలైన మొదటి రోజునుంచి హిట్ టాక్‌తో రోజు రోజుకూ విశేష ప్రేక్షకాదరణ పొందుతూ విజయ పథంలో పయనించింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేసింది. 1995లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని ఆ ఏడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మోహన్ బాబును కలెక్షన్ కింగ్‌గా నిలబెట్టింది పెదరాయుడు చిత్రం. ఈ చిత్రం అనూహ్యవిజయం గురించి ఆరోజుల్లో సినీ జనాల్లో ఇదే చర్చ జరిగింది. అప్పటి వరకు మోహన్ బాబు చిత్రాలు అర్థ శతదినోత్సవం కూడా ఎరుగని కేంద్రాల్లో సైతం పెదరాయుడు చిత్రం విజయవంతంగా శతదినోత్సవం జరుపుకోవడం అప్పట్లో విశేషమే. అంతకు ముందు మోహన్‌బాబు నటించిన సూపర్ హిట్ మూవీలను మించి పెదరాయుడు చిత్రం రికార్డులు తిరగరాయడంతో ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ చిత్రంలో పెదరాయుడుగా, ఆయన తమ్ముడు రాజాగా మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఆయన భార్య లక్ష్మి పాత్రలో భానుప్రియ, రాజా భార్యగా సౌందర్య అభినయించారు. పెదరాయుడు చినతమ్ముడుగా రాజా రవీంద్ర నటించాడు. పెదరాయుడు మేనత్తగా జయంతి, ఆమె భర్తగా చలపతిరావు, వారి కొడుకుగా ఆనంద్ రాజ్ నటించారు. పెదరాయుడు తండ్రి పాపారావు పాత్రలో రజనీకాంత్ ఆకట్టుకున్న తీరు అమోఘం. ఈ సినిమాలో సత్యనారాయణ సౌందర్య తండ్రి పాత్రలో అతిథిగా కనిపించారు. బాబూ మోహన్, బ్రహ్మానందం, తండ్రీ కొడుకులుగా అలరించారు. వీరిద్దరి కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో కథను మలుపు తిప్పిన పాత్రలో శుభశ్రీ నటించింది.
ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. పెదరాయుడు చిత్రంలోని డైలాగులు ఇప్పటికీ ఎంతో ఫేమస్. ఈ సినిమాకు రమేష్, గోపీ హాస్య రచన చేశారు. సత్యమూర్తి రాసిన మాటలు విశేష ఆదరణ పొందాయి. పెదరాయుడు చిత్రానికి కోటి సంగీతం కూడా పెద్ద అస్సెట్. ఈ సినిమాకు భువనచంద్ర, సాయి హర్ష, సామవేదం షణ్ముఖ శర్మ పాటలు రాశారు. ఈ చిత్రంలోని 5 పాటలు, జనాలను విశేషంగా అలరించాయి. మోహన్‌బాబు సొంత చిత్రాల్లో ఆయనకు మధుర గాయకుడుగా జేసుదాసు పాడిన పాటలు హైలైట్‌గా ఉండేవి. పెదరాయుడు చిత్రంలోనూ ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ జేసుదాసుతో ఓ పాట పాడించారు. ‘కదిలే… కాలమా..’ ఈ పాట నెంబర్ వన్‌గా నిలిచింది.
పెదరాయుడు చిత్రం 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అనేక కేంద్రాల్లో వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పింది. దాంతో కలెక్షన్ కింగ్‌గా మోహన్‌బాబు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఈనాటికీ మోహన్‌బాబు పేరు చెప్పగానే పెదరాయుడు, ఈ సినిమా పేరు వినగానే మోహన్‌బాబు గుర్తుకు రాక మానరు. ఇప్పటికే బుల్లితెరపై పెదరాయుడు సినిమా వస్తుంటే ఎంతో ఆసక్తిగా చూసే అభిమానులు ఉన్నారు.