2024 సంక్రాంతి బరిలో పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటిలో పెద్ద సినిమాలతో పాటు పలు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఒకే టైమ్‌లో 8 సినిమాలు విడుదల కానుండటంతో మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాటిలో స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో ఫ్యాన్స్‌కి ఈ సంక్రాంతి ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఈ సంక్రాంతికి సందండి చేయబోయే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం..
గుంటూరు కారం: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మాస్ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ వాటెండ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే విడుదలైన ‘కుర్చీమడత పెట్టి’ సాంగ్‌కు భారీ స్పందన వస్తుంది. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సైంధవ్: వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. దాదాపు 80 నుంచి 100 కోట్ల బడ్జెట్‌తో వెంకటేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోన్న ఈ మూవీకి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సైంధవ్‌తోనే వెంకటేష్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీలో ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. జనవరి 13న సైంధవ్ రిలీజ్ అవుతోంది.
నా సామిరంగ: అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. ఈ సారి రీమేక్ మూవీతో సంక్రాంతి పోటీకి సిద్ధమయ్యాడు నాగార్జున. దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో నాగార్జునతో పాటు యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘పురింజు మరియం జోస్’ ఆధారంగా నా సామిరంగా రూపొందుతోంది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.
ఈగల్: రవితేజ ఈ సంక్రాంతికి (జనవరి14) ఈగల్ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. యాభై కోట్ల బజ్డెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈగల్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు.
హనుమాన్: తేజా సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కింది. ఈ మూవీ బడ్జెట్ 80 కోట్లకు పైనే అని సమాచారం. హనుమాన్ కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో జనవరి 12న విడుదలవుతోంది. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హీరోలకు పోటీగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలవడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కెప్టెన్ మిల్లర్: స్ట్రెయిట్ సినిమాలతో పాటు ధనుష్ డబ్బింగ్ మూవీ కెప్టెన్ మిల్లర్ కూడా ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
లాల్ సలాం: రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్ సలాం’. ఈ సినిమాకి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్, నిరోషాతో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ముంబయి డాన్ మొయిద్దీన్ భాయ్‌గా రజినీ కాంత్ కనిపిస్తున్నారు.
వీటితో పాటు తమిళ నటుడు శివ కార్తీకేయ హీరోగా నటిస్తున్న ‘అయలాన్‘, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్- విజయ్ సేతుపతి అప్ కమింగ్ మూవీ ‘మెరీ క్రిస్మస్’ విడుదల కాబోతున్నాయి. మొత్తంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న అన్ని సినిమాల బడ్జెట్ 600 నుంచి 700 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమా టాప్‌లో ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.