మరో రెండు రోజుల్లో 2018 ఏడాది ముగిసిపోనుంది. ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని వండర్స్ చేశాయి. కొన్ని పాత్రలు గుర్తుండిపోయేలా మెప్పించాయి. వాటిలో ఉత్తమమైన పాత్రలు. ఉత్తమ సినిమాలు గురించి చెప్పాలంటే..
ఈ ఏడాది గుర్తుండిపోయే పాత్రలో నటించిన ఉత్తమ హీరోల విషయంలో రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్‌చరణ్ మందు వరుసలో ఉన్నాడు. రంగస్థలం సినిమాలో చిట్టి బాబు చేసిన హంగామా హైలైట్‌గా నిలుస్తుంది. నటుడిగా రామ్‌చరణ్‌ను మరో మెట్టు ఎక్కించిన పాత్ర. ‘రంగస్థలం’కి సినిమాలో చెవిటి చిట్టిబాబుగా నటించడానికి రామ్‌చరణ్ ఎలాంటి సందేహం పెట్టుకోలేదు. దర్శకుడిపై నమ్మకం పెట్టుకుని పాత్రను మెప్పించగలిగాడు. పైగా ఆ పాత్రని నరనరాన జీర్ణించుకుని చిట్టిబాబుగా మంచి హిట్ కొట్టాడు. అంతే కాకుండా తన నటనపై కామెంట్స్ చేసి వారి నోళ్లు మూయించాడని చెప్పొచ్చు. ప్రయోగం చేయడమే కాకుండా ఆ ప్రయోగంతో హిట్ కొట్టడం ఓ మైలురాయి. స్టార్ హీరోలు అసూయపడేలా, అభిమానులు తల ఎత్తుకునే రేంజ్‌లో రంగస్థలం సక్సెస్ అయింది. అంతే కాకుండా చెర్రీని నటుడిగా ఓ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ ఏడాది చాలా మంది నుంచి ఉత్తమ ప్రదర్శనలు వచ్చినా చిట్టిబాబుని పెర్ఫార్మెన్స్‌ను బీట్ చేయలేకపోయాయి. అందుకే ఈ ఏడాదికి చిట్టిబాబే ఉత్తమ హీరో.
ఉత్తమ హీరోయిన్ విషయానికి వస్తే కనీసం నాలుగు సినిమాల అనుభవం కూడా లేని కీర్తి సురేష్ ‘మహానటి’ సావిత్రి పాత్రని పోషించడం ఓ సాహసమే. అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు సావిత్రి పాత్రకి కీర్తిని ఎలా తీసుకున్నారని చర్చకూడా జరిగింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించి ఆలోచించిన వారందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ‘మహానటి’ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కూడా బాగా గుర్తుండి పోయే పాత్రల్లో ఒకటిగా నిలుస్తుంది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందనే చెప్పాలి. సావిత్రమ్మ దిగి వచ్చిందా అన్నట్టుగా అభిమానులను మెప్పించింది కీర్తి సురేష్.
ఉత్తమ సినిమా విషయానికి వస్తే ‘గీత గోవిందం’ అని చెప్పాలి. పెట్టిన పెట్టుబడితో పోలిస్తే కలెక్షన్స్ వసూళ్లలో ‘గీత గోవిందం’ని మించిన సినిమానే లేదు. తక్కువ బడ్జెట్‌లో, రూ. 15 కోట్ల లోపు ఖర్చుతో తెరకెక్కించారు. ఓ పాతిక కోట్లు వసూలు చేస్తుందనుకున్న సినిమా తొలిరోజే భారీ వసూళ్లు అందించి అదరగొట్టింది. వారం కాకుండానే లాభాలు ఆర్జించింది. ఆ తర్వాత ఒక్కో ల్యాండ్ మార్క్‌ను దాటుతూ వెళ్లింది. సుమారు 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ ఏడాది టాప్ సినిమాగానే కాకుండా అత్యధిక ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాగా కూడా చెప్పొచ్చు.