‘2.ఓ’ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో హీరోయిన్ అమీ జాక్సన్ ‘2.ఓ’ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. స్వయంగా స్టంట్స్ చేశారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం షూటింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఆమె సాధన చేశారట. ఈ క్రమంలో తీసిన వీడియోను అమీ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో ఆమె నడుముకు తాళ్లు కట్టుకొని.. స్టంట్ చేస్తూ కనిపించారు. ‘2.ఓ’ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు స్టంట్స్ ప్రిపరేషన్ కోసం కొంత మంది ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్లు చెన్నైకు వచ్చారు. సాధనలో భాగంగా నేను చేసిన తొలి స్టంట్ ఇది. ప్రతి స్టంట్‌ను స్లో మోషన్‌లో షూట్ చేశాం.. అప్పుడే చేసిన తప్పులు తెలుస్తాయి. షూట్ సమయానికి వాటిని సరిదిద్దుకోవచ్చు’ అని అమీ ఈ వీడియో గురించి చెప్పారు.
ఈ వీడియోకు సోషల్‌మీడియాలో విశేషమైన స్పందన లభించింది. అమీ స్వయంగా స్టంట్స్ చేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. ‘చాలా కష్టపడ్డావు, అద్భుతం, ఆశ్చర్యంగా ఉంది, వీడియోను షేర్ చేసినందుకు ధన్యవాదాలు అమీ.. ఓ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా తీయాలంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలియాలి, అమీకి హ్యాట్సాఫ్, నిజంగా గొప్పగా చేశావు, ఇలాంటి స్టంట్స్ ప్రమాదంతో కూడుకున్నవి.. జాగ్రత్త.. ‘ అంటూ తెగ కామెంట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ ‘2.ఓ’ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.