కరోనా వైరస్ ప్రతాపానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారానికి అక్కడ మృతుల సంఖ్య 12,700 దాటింది. నిన్న ఒక్కరోజే 1,900 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3,99,667 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 22,020 మంది కోలుకోగా.. 12,878 మంది మరణించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు గతంలో ఉన్నంత విషమంగా లేవని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం అంచనా వేసిన స్థాయిలో మరణాలు ఉండకపోవచ్చునని ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు. లక్ష నుంచి రెండు లక్షల మందిని మహమ్మారిని బలిగొనే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన ప్రకటనను సవరించిన ఆయన గతంలో అంచనా వేసిన కంటే మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుందని అభిప్రాయపడ్డారు.
పరిస్థితి తీవ్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,400 మంది మృతిచెందారు. 1,38,000 కేసులు నమోదయ్యాయి. పక్కనే ఉన్న న్యూజెర్సీలో 44,416 మందికి వైరస్ సోకగా.. 1,200 మంది మృత్యువాతపడ్డారు. వచ్చే వారంలో ఈ గణాంకాలు మరింత ఆందోళనకర స్థాయికి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, సామాజిక దూరం వంటి నిబంధనల్ని కచ్చితంగా అమలుచేస్తే మరణాల సంఖ్యను భారీగా తగ్గించొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాలో వైరస్ కట్టడికి పటిష్ఠమైన చర్యలు చేపడతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 97 శాతం జనాభా ప్రభుత్వ నిబంధనల పరిధిలో ఉన్నారు. రంగంలో దిగిన సైన్యం అవసరమైన చోట తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తోంది.