ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మైసూరులోని ఓ బాల మేధావి 7 నెలల ముందుగానే గ్రహించాడు. అతడు చిన్న వయస్సులోనే జ్యోతిష్య శాస్త్రాన్ని ఔపాసన పట్టిన మహామేధావి. అతడి పేరు అభిగ్య ఆనంద్. ఇంత చిన్న వయసులోనే గుజరాత్‌లోని మహర్షి వేద విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా నియమించబడటం గొప్ప విషయం. గ్లోబల్ చైల్డ్ ఫ్రాడిజీ అవార్డును కూడా అందుకున్నాడు. ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆనంద్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలోనూ పీహెచ్‌డీ చేశాడు. జ్యోతిష్యంలోని వివిధ విధానాలపై అనేక పరిశోధనలు చేశాడు. వాస్తులోనూ నైపుణ్యం సాధించాడు.
ప్రపంచంలోనే అతి చిన్న వయసున్న జ్యోతిష్యుడిగా పేరొందిన అభిగ్య ఆనంద్. కరోనా వైరస్ గురించి 7 నెలల క్రితమే అంచనా వేశాడు. దీనికి సంబంధించి ఓవీడియోను సైతం విడుదల చేశాడు. గ్రహస్థితులను బట్టి రాబోయే 6 నెలల్లో ప్రపంచానికి ముప్పు రాబోతుందని ఊహించాడు. 2019 నవంబర్ నుంచి 2020 మే వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారని తెలియజేశాడు. రవాణా వ్యవస్థ దెబ్బతింటుందని, చైనా యుద్ధ సమస్యను ఎదుర్కొంటుందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని వెల్లడించాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. మే 29 తర్వాత పరిస్థితులు చక్కబడతాయని కూడా అభిగ్య తెలిపాడు. ఇప్పుడు అభిగ్య వీడియోలు వైరల్ అవుతున్నాయి.