ఈ ఫొటోలో కనిపిస్తున్న 106 ఏళ్ల బామ్మ తన హృదయాన్ని గెలుచుకున్నారని అంటున్నారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. రాజమహేంద్రవరానికి చెందిన రేలంగి సత్యవతి అనే బామ్మ మహేష్‌కు వీరాభిమాని. మహేష్ చూడటానికి సత్యవతి అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారట. ఈ విషయం తెలిసి మహేష్ ఆమెను కలిశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
‘ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు మహేష్.
ప్రస్తుతం మహేష్ ‘మహర్షి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ పెట్టిన పోస్ట్‌పై ప్రముఖ నటుడు సుమంత్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘మిమ్మల్ని పెద్దవారంతా ఇష్టపడతారు. ఈ తరం కథానాయకుల్లో మా తాతగారు కూడా మిమ్మల్ని ఎంతో ఇష్టపడేవారు’ అని పేర్కొన్నారు.