HomeTelugu Big Storiesహైదరాబాద్‌లో 100 ఏళ్ల రికార్డు వాన

హైదరాబాద్‌లో 100 ఏళ్ల రికార్డు వాన

3 24

భారీ వర్షానికి హైదరాబాద్‌ మహానగరం తడిసి ముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ.. దఫదఫాలుగా కుండపోత పోసింది. ఏకధాటిగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 100 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంకితభావంతో నగరంలో సహాయకచర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఈ సీజన్‌ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు.

ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా పెద్ద పెద్ద చినుకులతో ధారాపాతంగా కురిసింది. కొన్ని గంటలపాటు ఏకధాటిగా పడటంతో హైదరాబాద్‌ ప్రజలు వణికిపోయారు. రికార్డు స్థాయి వర్షానికి హైదరాబాద్ నీట మునిగింది. కాలనీ, బస్తీ అన్న తేడా లేకుండా ఇళ్లు నీటమునిగాయి. చెరువులు, నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు వరద గోదారుల్లా మారాయి. ఎప్పట్లాగే కిలోమీటర్లకొద్దీ వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నాలాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నడుంలోతు నీళ్లు చేరడంతో రోడ్లు చెరువులను తలపించాయి. ఆ నీళ్లలో మునిగిన స్కూటీలు.. అద్దాలదాకా మునిగిన కార్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్‌ ప్రయాణానికి గంటకుపైగా సమయం పట్టింది. 1908లో సెప్టెంబరు 27న ఒకేరోజు హైదరాబాద్‌లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది.

3a 2

అల్వాల్‌, కాప్రా, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్‌, యూసు్‌ఫగూడ, మెహిదీపట్నం, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, గోషామహల్‌, అంబర్‌పేట్‌, బేగంపేట్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, ముసాపేట్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. సగటున 1 సెం.మీ నుంచి 12 సెం.మీ వరకు వాన కురిసింది. కాప్రా, అల్వాల్‌, కూకట్‌పల్లి సర్కిళ్లలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని మంఖాల్‌లో అత్యధికంగా 14.1 సెం.మీ. వర్షం కురిసింది.

ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు హైదరాబాద్ స్తంభించింది. రోడ్లపై కిలోమీటర్లకొద్దీ క్యూలు కనిపించాయి. ఐటీ కారిడార్‌లో రోడ్లన్నీ వాహనాలు, వరద నీటితో నిండిపోయాయి. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్ద వంతెనపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. రాంనగర్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, రాజ్‌భవన్‌ రోడ్‌, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాలి కంటే ఎక్కువ ఎత్తుకు వరద నీరు నిలిచింది. పలువురు వాహనదారులు గాయపడ్డారు.

యూసు్‌ఫగూడలో ఓ ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. శ్రీనగర్‌ కాలనీలో చెట్లు కూలాయి. బేగంపేటలో ఓ రెస్టారెంట్‌లోకి నీళ్లు వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని ఈ-2 హాస్టల్‌ గదుల్లోకి వర్షపు నీరు చేరింది. ఉప్పల్‌ ఆదర్శ్‌ నగర్‌లో 40 ఇళ్లలోకి నీరు చేరింది. ఎర్రగడ్డ ప్రేంనగర్‌లో నడుము లోతు నీరు ముషీరాబాద్‌లోని నాగమయ్యకుంట, ఎంఎస్‌ మక్తా, కూకట్‌పల్లి, సఫ్దార్‌నగర్‌, కవాడిగూడలోని పద్మశాలి కాలనీ, గాంధీనగర్‌, పాత రామంతాపూర్‌, ఎన్‌ఎండీసీ కాలనీల్లోని ఇళ్లు నీట మునిగాయి. గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రి వద్ద రోడ్డుపై నడుం లోతు నీళ్లు నిలవడంతో 2 గంటలపాటు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌ పరిసరాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. మూసారాంబాగ్‌-అంబర్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాల్‌ మెగా మార్ట్‌ వద్ద రోడ్డు చెరువును తలపించింది. మల్కాజిగిరిలోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, ఎన్‌ఎండీసీ కాలనీ, రాజానగర్‌లో నాలాలు పొంగి పొర్లాయి. ఇళ్లల్లోకి నాలా నీళ్లు చేరాయి.

వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులు ఉప్పొంగాయి. మాదాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో చెరువులు నిండి దిగువకు వరద నీటి ప్రవాహం పెరిగింది. హుస్సేన్‌ సాగర్‌లో కూడా నీటిమట్టం భారీగా పెరగడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 513 మీటర్లు కాగా.. ఆ మేరకు నీళ్లు చేరాయి. బండ చెరువు పూర్తిగా నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. కాగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెరువులు అలుగుపోశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. పంటలు నీట మునిగాయి. స్తంభాలు , చెట్లు కూలిపోయాయి. పిడుగులూ పడ్డాయి. హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ఒక్కరోజే 177 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 13.2 సెం.మీ, సిరిసిల్ల జిల్లాలో 9.55 సెం.మీ వర్షం పడింది. సిరిసిల్ల జిల్లా నీలోజుపల్లిలో పిడుగుపాటుకు ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu