దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాలు కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ్టితో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1397కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 1238 మందికి ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారినపడి 124 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు. భారత్‌లో కరోనా మూడో దశకు చేరుకుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించింది. అక్కడ మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్ తరహాలో భారత్‌లో కరోనా విజృంభించే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. కానీ రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వ్యాప్తిచెందకుండా మరిన్ని చర్యలు చేపట్టింది.
సాధారణంగా ఒక ప్రాంతంలో 10కి పైగా కరోనా కేసులు నమోదైతే ఆ ప్రాంతాన్ని ఒక క్లస్టర్‌గా గుర్తిస్తారు. ఒకే ప్రాంతంలో ఇలాంటి క్లస్టర్లు ఎక్కువగా ఉంటే వాటిని హాట్‌స్పాట్‌లు అంటారు. ఇలాంటి హాట్‌స్పాట్స్ దేశంలో 10 వరకు ఉన్నాయి. ఢిల్లీలోని దిల్షాన్ గార్డెన్, నిజాముద్దీన్.. యూపీలోని నోయిడా, మీరట్.. రాజస్థాన్‌లోని బిల్వారా… గుజరాత్‌లోని అహ్మదాబాద్.. మహారాష్ట్రలోని ముంబై, పుణె.. కేరళలోని కాసర్ గోడ్, పతనంతిట్ట ప్రాంతాలు కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌లుగా మారాయి. దక్షిణాదిన కేరళలో మాత్రమే హాట్‌స్పాట్‌ను గుర్తించారు. మిగతావన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. విదేశాలనుంచి వచ్చిన వారిలో ఎక్కువగా క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి ఈ ప్రాంతంలోనే తిరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ 10 ప్రాంతాల్లోనే 24 గంటల వ్యవధిలో 227 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ప్రతి 100 కేసుల్లో ఒకరు మరణిస్తే ఆ ప్రాంతాన్ని కచ్చితంగా హాట్‌స్పాట్‌గా గుర్తిస్తారు. ఈ 10 ప్రాంతాల్లో కరోనా పరీక్షలను వేగవంతం చేయడంతో పాటు లాక్‌డౌన్ నిబంధలను కఠినంగా అమలుచేయడానికి సిద్ధమవుతున్నారు.