సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక.. ఇంకా ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి, వంటి వెబ్‌సీరీస్‌లో చేసింది. ఇప్పటికే చాలా రోజుల నుంచి హ్యాపీ వెడ్డింగ్ సినిమా మీడియాలో హల్చల్ చేస్తుంది. మెగా డాటర్ నిహారిక ఈ సినిమాలో నటిస్తుండటం, సాహో వంటి భారీ సినిమాను నిర్మిస్తున్న మూవీ క్రియేషన్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మించడం… ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. మరి ఈ సినిమా నిహారిక కెరీర్‌కు ఎంత వరకు ఉపయోగపడుతుంది..?
కథ: విజయవాడ అబ్బాయి ఆనంద్ విరాట్ వాకలపూడి (సుమంత్ అశ్విన్), హైదరాబాద్ అమ్మాయి అక్షర (నిహారిక ) ప్రేమ, పెళ్లి కథే ఈ చిత్రం. విజయవాడ వాసి (నరేష్), లలిత (పవిత్రా లోకేష్) ల అబ్బాయి ఆనంద్ విరాట్. యాడ్ ఫిలిం మేకర్ అయిన ఆనంద్ మెచ్యూర్డ్ గా ఆలోచించే మనస్తత్వం కలవాడు. హైదరాబాద్‌లో ఉండే హనుమంతరావు (మురళి శర్మ), లత (తులసి)ల అమ్మాయి అక్షర. అక్షర డిజైనర్‌గా పనిచేస్తుంది. ఏ విషమైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అమ్మాయి. ఓ బస్సు ప్రయాణంలో అక్షర, ఆనంద్ విరాట్‌లు ప్రేమలో పడిన వీరిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. కానీ అదే సమయంలో ఆనంద్ చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా అక్షర ఆలోచనలో పడుతుంది. అదే సమయంలో తను గతంలో ప్రేమించి విజయ్ (రాజా) మరోసారి తన జీవితంలోకి రావటంతో ఆనంద్‌ను పెళ్లి చేసుకోవాలా వద్ద అన్న ఆలోచనలో పడిపోతుంది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు ఎలా రియాక్ట్ అయ్యాయి..? చివరకు వీరిద్దరు ఒక్కటయ్యారా..? అనేదే కథలోని అంశం.
నటీనటులు: నిహారిక, సుమంత్ అశ్విన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో సుమంత్ అశ్విన్ నటనకు సూపర్బ్.ఒక్కమనసు సినిమాతో నిరాశపరిచిన నిహారికకు ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. ఇప్పటికే సుమంత్ అశ్విన్ లవర్ బాయ్ రోల్స్‌లో తానేంటో నిరూపించుకున్నాడు అదే తరహాలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సీనియర్ నరేష్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, ఇంద్రజ, రాజాలు రొటీన్ పాత్రల్లో కనిపించారు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ : పెళ్లి నేపథ్యంలో ఇప్పటికే తెలుగు తెర పై అనేక చిత్రాలు కనువిందు చేసి, విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్యాపి వెడ్డింగ్ సినిమాను కూడా అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాం చేశాడు దర్శకుడు లక్ష్మణ్. పెళ్లి ఇంట్లో ఉండే సందడి, కుటుంబ అనుబంధాలను బలంగా చూపించిన దర్శకుడు, హీరో హీరోయిన్ల మధ్య గొడవకు కారణాన్ని మాత్రం అంత బలంగా చూపించలేక పోయాడు. చిన్న విషయానికి హీరోయిన్ పెళ్లి నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడం వంటి విషయాలు సిల్లీగా అనిపిస్తాయి. అదే సమయంలో కథనం కూడా నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. సినిమాకు ప్రధాన బలం సంగీతం. శక్తికాంత్ కార్తీక్ అందించిన పాటలు బాగున్నాయి. పాటలు కావాలని ఇరికించినట్టు కాకుండా సందర్భాన్ని తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
హైలైట్స్
నిహారిక నటన
సంగీతం
పాటలు
డ్రాబ్యాక్స్
కథనం నెమ్మదిగా సాగడం
చివరిగా : అమ్మాయిలు మెచ్చే సినిమా
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
సినిమా : హ్యాపీ వెడ్డింగ్
నటీనటులు : సుమంత్ అశ్విన్, నిహారిక, మురళీ శర్మ, నరేష్, ఇంద్రజ, తులసి తదితరులు
దర్శకత్వం : లక్ష్మణ్ కార్య
నిర్మాతలు : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణా రెడ్డి
సంగీతం : శక్తికాంత్ కార్తీక్