ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలాకు బెదిరింపులు వస్తున్నాయని సమాచారం. అయితే ఈ విషయమై ఆమె పోలీస్ లకు ఏమీ కంప్లైంట్ చేయలేదు కానీ మీడియా దగ్గర వాపోయిందిట. అందుకు కారణం ఆమెహీరోయిన్ గా నటించిన చిత్రం ‘హేట్ స్టోరీ 4’ లో ఉన్న కొన్ని డైలాగులు అని చెప్తున్నారు. ముఖ్యంగా ‘ద్రౌపతికి ఐదుగురు పాండవులు. నాకు కేవలం ఇద్దరే’ అనే డైలాగే వివాదానికి కారణమవుతోంది. ‘హేట్ స్టోరీ’ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రమిది. ఇటీవల దీని ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ఊర్వశికి కొందరు ఫోన్లు చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట.
సినిమాలో ఊర్వశి తన పాత్రను ద్రౌపదితో పోలుస్తూ చెప్పే డైలాగులు ఉన్నాయి. దాంతో ద్రౌపది గురించి తప్పుగా చూపించారని పలువురు ఆందోళనలు చేస్తున్నారు. అసభ్యకర కామెంట్లు, బెదిరింపులు విని ఊర్వశి షాక్‌కు గురైందని ఆమె సన్నిహితులు మీడియాకు తెలిపారు. మార్చి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.