ప్రముఖ నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ ప్రమాద వార్త వినగానే చంద్రబాబు హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసుపత్రికి బయల్దేరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనాస్థలానికి వెళ్లాలని, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని చంద్రబాబు ఆవేదన చెందారు. హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు అని అన్నారు.
హరికృష్ణ లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని, సాంఘిక ,పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చేయి అని చంద్రబాబు కొనియాడారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. నందమూరి తారకరామారావుకు ఆయన అత్యంత ఇష్టుడు అని, ఎన్టీఆర్ చైతన్య రథసారథిని స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్‌ను ప్రజలకు చేరువ చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. నిరాడంబరుడు, నిగర్వి, స్నేహానికి మారుపేరు అయిన హరికృష్ణను కోల్పోవడం బాధాకరమన్నారు.