ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సాయంతో 2,348 మంది ముస్లింలు హజ్ యాత్రకు సిద్ధం కాగా.. మొదటి విడతగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 200 మంది బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని ప్రజావేదిక వద్ద శుక్రవారం ముస్లింలు సభ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరించారు. ‘నారా హమారా.. టీడీపీ హమారా’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లడుతూ.. 2019లో హజ్ యాత్రకు గన్నవరం విమానాశ్రయం నుంచే విమానాలు బయలుదేరతాయని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో రూ.80 కోట్లతో, కడపలో రూ.12కోట్ల హజ్ హౌస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. హజ్ యాత్రికులపైనా కేంద్రం జీఎస్టీ విధిస్తుండటం దారుణమని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీల ఉన్నత చదువులకు రూ.10-15లక్ష సాయం చేస్తున్నామని ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో బిజేపి ఆటలు సాగనివ్వమని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌తో లాలూచీ కారణంగానే బిజేపి రాష్ట్రానికి ఏమీ చేయని పరిస్ధితి నెలకొందని మండిపడ్డారు. నిన్న బీజేపీకి సహకరించేందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ పాల్గొనలేదని దుయ్యబట్టారు. గోద్రా అల్లర్లలో నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ రాజీనామాకు గట్టిగా తాను పట్టుబట్టిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆయన అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని అల్లాకు దువా చేయాలన్న చంద్రబాబు.. ముస్లింలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉర్దూలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్న సీఎం… ముస్లింలతో కలిసి ప్రార్థనలు కూడా చేశారు.