బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, మౌనీ రాయ్ జంటగా నటించిన చిత్రం “గోల్డ్”. 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్ మెడల్ అందించిన కోచ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన తొలిరోజే రూ. 25.25 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది విడుదలైన సంజు, రేస్ 3 సినిమాల తర్వాత తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. సౌదీ అరేబియాలో విడుదల కానున్న తొలి బాలీవుడ్ సినిమాగా “గోల్డ్” చరిత్ర సృష్టించనుంది.
“దేశానికి పసిడి పతకాన్ని అందించిన కథాంశంతో తెరకెక్కిన గోల్డ్ సినిమా సౌదీ అరేబియాలో విడుదల కాబోతుంది. తద్వారా సౌదీలో విడుదలవుతున్న తొలి బాలీవుడ్ సినిమాగా కూడా నిలవనుంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియాలో 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్‌ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ప్రారంభించారు. సౌదీ రాజధాని రియాద్‌లో ప్రారంభించిన ఓ థియేటర్‌లో మొదటగా “బ్లాక్ పాంథర్” సినిమాను ప్రదర్శించారు.