బాహుబలి అనంతరం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో ప్రభాస్ మాట్లాడారు. ‘సాహో’ సినిమా గురించి, శ్రద్ధాకపూర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘సినిమాలో శ్రద్ధాది కీలక పాత్ర. ఆమె పాత్ర కేవలం పాటలకే పరిమితం కాదు. శ్రద్ధ పాత్రతోనే సినిమా మొదలవుతుంది. సినిమా నడిచే కొద్దీ ఆమె పాత్ర బలపడుతూ ఉంటుంది. సినిమాలో మొత్తం 11 కీలక పాత్రలు ఉన్నాయి. హిందీలో డైలాగులు చెప్పేటప్పుడు శ్రద్ధ రెండు మూడు టేక్‌లు తీసుకుంటోంది. కానీ తెలుగులో మాత్రం ఒక్క టేక్‌లోనే చెప్పేస్తోంది. బహుశా తెలుగులో డైలాగులు బాగా ప్రాక్టీస్ చేసినట్లుంది. నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు. మాట్లాడటం అంతగా రాదు. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో పుట్టాను. నా చుట్టూ ఉండేవారిలో తెలుగు మాట్లాడేవారే ఎక్కువగా ఉన్నారు’.
‘తెలుగులో ఏదన్నా సన్నివేశం చేయాలంటే..ఓకే అని ఎంతో ఉత్సాహంగా చెప్తాను. ఇప్పుడు హిందీలో చేయాలి అంటే మాత్రం కాస్త నిరుత్సాహపడతాను. యాక్షన్ సినిమాల్లో నాకు ‘షోలే’ ‘దబాంగ్’ అంటే ఇష్టం. బాలీవుడ్ నటీమణుల్లో దీపిక పదుకొణె, కత్రినా కైఫ్, ఆలియా భట్ అంటే ఇష్టం. ‘సాహో’ సినిమా తర్వాత ఏం చేస్తానో నాకు ఎలాంటి క్లారిటీ లేదు. వ్యాపారం చేయొచ్చు, లేదా వ్యవసాయం చేయొచ్చు. లేదా రెండూ చేయొచ్చు. బాహుబలి సినిమా నచ్చినవారందరికీ సాహో కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. స్క్రిప్ట్, దర్శకుడిపై నేను ఎంచుకునే సినిమాలు ఆధారపడి ఉంటాయి. సినిమాకు స్క్రిప్టే హీరో. అదే విధంగా దర్శకుడి ప్రతిభ కూడా ముఖ్యమే. ఆ స్క్రిప్ట్‌ను చక్కగా తెరకెక్కించి ప్రేక్షకుడికి చేరువయ్యేలా చేసేది దర్శకుడే’ అని చెప్పుకొచ్చారు మన రెబల్ ప్రభాస్.