వైసిపి బలోపేతానికి ఆ పార్టీ అధినేత జగన్ సామాజిక వర్గాల వారీగా దృష్టి పెట్టారు. దానిలో బాగంగా ఆయా సామాజిక వర్గాల అధ్యయన కమిటీలను ఏర్పాటుచేసారు. ఈ కమిటీలు సామాజిక వర్గాలలో ఉన్న సమస్యలు గుర్తించడంతోపాటు సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో అధ్యయనం చేసి నివేదికలను సిద్దం చేయాలని శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల నాటికి వివిధ వర్గాల ప్రజలు ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వైసిపి అధినేత జగన్ గత ఎన్నికలకు ముందు జరిగిన పొరపాట్లను మరొకసారి పునరావృతం కాకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు అవుతున్నా మొన్నటివరకు పార్టీ అనుభంద సంఘాలను బలోపేతం చేయడం కాని వాటి పనితీరు కూడా సక్రమంగా లేకపోవడంతో గత ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని జగన్ బావిస్తున్నారు. అందులో భాగంగా వరుసగా అన్ని కమిటీలను ఏర్పాటుచేసి వరుస సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇప్పటికే విజయవాడ రాష్ర్ట కార్యాలయంలో బిసి, మహిళా, స్టూడెంట్, యూత్, మైనారిటీ మీటింగ్ లు నిర్వహించారు. గ్రామాలలో ఆయా కమిటీలకు సంబంధించి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో దానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దానిపై స్పష్టమైన అభిప్రాయం సేకరించాలని ఆ కమిటీలకు ఆదేశాలు జారీచేస్తున్నారు జగన్. ఇప్పటికే విజయవాడలో జరిగిన బీసీ సదస్సుకు నేరుగా వైసిపి అధినేత జగన్ హాజరై బిసిలకు అన్నివిదాలుగా వైసిపి అండగా ఉంటుందని స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున బిసిలతో అనంతపురంలో బిసి డిక్లరేషన్ పార్టీ తరపున ప్రకటించనున్నారు. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు జగన్. ఈసారి ఎట్టిపరిస్థితులలోను అదికారంలోకి వచ్చేలా అన్ని వర్గాలను మెప్పించే ప్రయత్నంలో భాగంగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాలి.