అలనాటి బాలీవుడ్ మాజీ నటి పూజా దడ్వాల్ తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్నారు. కొంతకాలంగా ఆమె క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని స్థితిలో ఉన్నారు. 1990ల్లో వచ్చిన ‘వీర్ ఘటి’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా పూజ నటించారు. తన అనారోగ్యం గురించి పూజ పలు మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. సాయం కోసం సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించాను. కానీ, కుదరలేదని తెలిపారు. నాకు క్షయ ఉందని ఆరు నెలల క్రితం తెలిసింది. సాయం కోసం సల్మాన్‌ను కలవడానికి యత్నించాను. కానీ, వీలుపడలేదు.కనీసం ఈ రకంగానైనా సల్మాన్ నా గురించి తెలుసుకుని సాయం చేస్తారని ఆశిస్తున్నాను. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నాను. కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాను. ఉన్న డబ్బంతా దానికే అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. టీ కొనుక్కోవడానికి కూడా వేరే వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనారోగ్యం గురించి తెలిసి భర్త, బంధువులు వదిలి వెళ్లిపోయారు. అని చెప్తూ బాధపడ్డారు పూజ. ఆమె ‘హిందుస్థాన్’, ‘సింధూర్ సౌగంధ్’ చిత్రాల్లోనూ నటించారు.