సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అందులో రణ్‌బీర్ నిజమైన సంజూలానే ఆ పాత్రలో ఒదిగిపోయారు. అయితే ఓ బ్యారక్‌లో టాయిలెట్ లీకవుతున్న సీన్ అభ్యంతరకరంగా, భారత్ జైళ్ల మీద చెడు అభిప్రాయాన్ని కలిగించేలా ఉందని ఓ కార్యకర్త సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) వద్ద ఫిర్యాదు చేశాడు.
‘సంజూ మూవీ ట్రైలర్‌లో సంజయ్ దత్ ఉన్న బ్యారక్‌లో టాయిలెట్ లీకు అవుతున్నట్లు ఓ సన్నివేశం ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రభుత్వం, జైలు అధికారులు జైళ్లలో ఉన్న బ్యారక్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి విషయాలను ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. గతంలో ఎంతో మంది గ్యాంగ్‌స్టర్ల జీవితాల మీద సినిమాలు వచ్చాయి. వాళ్లందరూ జైలులో గడిపే సన్నివేశాల్లో ఇలా ఎన్నడూ చూపించలేదు. ఇలాంటి సీన్ల కారణంగా భారత్‌లో ఉన్న జైళ్ల మీద, జైలు అధికారుల మీద చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది’ అని పృథ్వీ మాస్కె అనే కార్యకర్త సీబీఎఫ్‌సీ ఛైర్మన్ ప్రసూన్ జోషీ, రణ్‌బీర్ కపూర్, నిర్మాతలకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోపోతే సినిమా విడుదలపై స్టే విధించమని కోరుతూ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని ఆయన ఆ లేఖలో వెల్లడించారు.
సంజయ్‌దత్ జైల్లో ఉన్న సమయంలో ఒక్కసారి టాయిలెట్ లీకై అతడి బ్యారక్ అంతా నీటితో నిండిపోతున్నట్లు ట్రైలర్‌లో ఓ సన్నివేశం ఉంది. సంజయ్ ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.