ఈరోజు అతిలోక సుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా భర్త బోనీ కపూర్ ఆమె గురించి మీడియాతో మాట్లాడారు. ఆమెను ప్రతిరోజూ మిస్సవుతూనే ఉంటామని చెప్పారు. ‘హీరోలున్నారు, లెజెండ్స్ ఉన్నారు. హీరోలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. కానీ లెజెండ్లు ఎప్పటికీ అమరులే. వారికి చావు అనేది ఉండదు. శ్రీదేవి ప్రతి క్షణం మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది. ఆమెను ఎప్పటికీ మిస్సవుతూనే ఉంటాం. శ్రీదేవి చనిపోయాక వచ్చిన తొలి పుట్టినరోజిది.’ అని వెల్లడించారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటూ ముంబయిలోని చాపెల్ రోడ్డులో బాలీవుడ్ ఆర్ట్ ప్రాజెక్ట్ సంస్థ 18 అడుగుల ఎత్తైన పెయింటింగ్‌ను రూపొందించింది. ఈ పెయింటింగ్‌ను రంజిత్ దాహియా, కునాల్ దాహియా, బిదీషా విశ్వాస్, అరూషా, రిచా రూపొందించారు.
శ్రీదేవి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గురుదేవ్’ చిత్రంలోని ఆమె ముఖాన్ని పెయింటింగ్‌గా రూపొందించారు. ఈ సందర్భంగా బోనీకపూర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె పెద్ద కుమార్తె జాన్వి చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జాన్వీ కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత తల్లిని తల్చుకుంటూ ‘నేను ఇంత వరకూ ఎవరి మీదా దేని కోసం ఆధారపడలేదు. ఎందుకంటే నాకు కావలసినవన్ని సమకూర్చే ఏకైక వ్యక్తి.. నా ప్రాణ స్నేహితురాలు నువ్వే అమ్మ’ అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ రోజు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ శ్రీదేవితో దిగిన అపురూపమైన ఫోటోను షేర్ చేశారు. మరోపక్క శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ రెండు రోజుల పాటు ఆమె నటించిన చిత్రాలను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఆగస్ట్ 13, 14న శ్రీదేవి నటించిన ‘మామ్’ ‘లమ్హే’, ‘మిస్టర్ ఇండియా’ ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ‘సద్మా’ ‘చాందిని’చిత్రాలను దిల్లీలోని ఫిలిం డివిజన్ ఆడిటోరియంలో ప్రదర్శించాలని ఆదేశించారు. కాగా శ్రీదేవి మరణం నుంచి ఇంకా ఆమె కుటుంబం, అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఆమె బతికి ఉండుంటే ఈరోజు తన కుటుంబంతో కలిసి 55వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొనేవారు.