ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్‌లను తెరకెక్కించేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. తెలుగులో మహానటి విజయవంతం కావడంతో అటువైపుగా దర్శక, నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా కారంచేడులో ఓ రైతు కుటుంబంలో పుట్టిన దగ్గుబాటి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. 100కు పైగా చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు డి. రామానాయుడు. 2010లో ఆయనకు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. ఆయన 1999లో బాపట్ల నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. మూవీ మొఘల్‌గా ఆయనను అభివర్ణిస్తారు. ఆయన జీవిత కథను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన తనయుడు సురేష్ దగ్గుబాటి క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడి బయోపిక్ తెరకెక్కించే ఉద్దేశం లేదని ఆయన తనయుడు నిర్మాత డి.సురేశ్‌బాబు తేల్చి చెప్పారు. తన తండ్రి రామానాయుడి బయోపిక్‌ను తెరకెక్కించాలనుకోవడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమన్నారు. ‘మహానటి’, ‘సంజు’ వంటి బయోపిక్స్‌కు దీనికి మధ్య చాలా తేడా ఉందన్నారు. వాళ్లు తమ జీవితాల్లో పలు కోణాలను చవిచూశారని సురేశ్ బాబు పేర్కొన్నారు. తన తండ్రి జీవితం అలా కాదని, కథలో కాంట్రవర్సీ లేకపోతే ఎవరూ వినరు, చూడరని వివరించారు. ఇప్పటికైతే ఆయన బయోపిక్ తెరకెక్కించాలన్న ఆలోచన లేదన్నారు.