మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే వార్త విషాదాన్ని నింపింది. అయితే వాజ్‌పేయీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అంటున్నారు. అందరూ ఆయన్ని వాజ్‌పేయీ అంటే తాను మాత్రం బాప్‌జీ అని పిలిచేవాడినని అంటున్నారు. రాజకీయ, క్రీడా, సినిమా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులంతా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న మధుర క్షణాలను నెమరు వేసుకుంటున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖను ట్వీట్ చేశాడు.
ఢిల్లీలో ఉన్నప్పుడు నా తండ్రి వాజ్‌పేయి ప్రసంగాలకు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత నేను పెద్దవాడిని అయ్యేకొద్ది వాజ్‌పేయితో కలిసి సమయం గడిపే అవకాశం వచ్చింది. మేం ఎప్పుడు కలుసుకున్నా కవిత్వాలు, సినిమాలు, రాజకీయాలు, నయమవుతున్న మోకాలి నొప్పుల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఆయన రాసిన పద్యాల్లోని ఓ పాటలో నాకు నటించే గౌరవం దక్కింది. మా ఇంట్లో ఆయన్ను అందరూ బాప్‌జీ అని పిలుస్తారు.
ఈరోజు దేశం ఓ గొప్ప తండ్రిని, నేతను కోల్పోయింది. చెప్పాలంటే చిన్నతనంలో నేను ఆయనతో గడిపిన క్షణాలను, కవిత్వాలను కోల్పోతున్నట్లుగా ఉంది. నేను సినిమాల్లో రాణిస్తున్న రోజుల్లో ఆయన ప్రభావం నాపై ఎంతో ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబీకులకు సంతాపం తెలుపుతున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మిమ్మల్ని మిస్సవుతాం బాప్‌జీ”అని షారూఖ్ పేర్కొన్నాడు. దీనికి ఓ పాట వీడియో లింక్‌ను జత చేశాడు.