శత్రు దేశాలను కూడా మిత్ర దేశాలుగా మార్చే దౌత్యనీతితో అంతర్జాతీయంగా భారత్‌ను ఒకస్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాయాది దేశం పాకిస్థాన్, అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్ సహా సార్క్ దేశాధినేతలు సంతాపం తెలిపారు. భారత్, అమెరికా సంబంధాలు మెరుగుపరచడంలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారని అమెరికా గుర్తుచేసింది. ఇరుదేశాల మధ్య సహజసిద్ధ సంబంధాలు ఉన్నాయని వాజ్‌పేయి అనేవారని దిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
భారత రాజకీయాల్లో వాజ్‌పేయీ పేరు ఓ అంతర్భాగమైందని.. ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని భారత్‌లో రష్యా రాయబారి విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు అటల్ మంచి మిత్రుడని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు. శాంతి కోసం వాజ్‌పేయీ చేసిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని పాకిస్థాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విశ్వాసం వ్యక్తంచేశారు. భారత్, పాక్ సంబంధాల బలోపేతానికి విదేశాంగ మంత్రిగా పునాది వేసిన వాజ్‌పేయి ప్రధాని అయ్యాక వాటిని కొనసాగించారని ఇమ్రాన్ గుర్తు చేశారు.