భారతరత్న అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్ లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. ఆయన స్థానిక సరస్వతి శిశుమందిర్ లో ప్రాథమిక విద్య అభ్యసించారు. విక్టోరియా కళాశాలలో చేరి హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడయ్యారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ పట్టా పొందిన వాజ్ పేయి ఆజన్మ బ్రహ్మచారి. 1939లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. బాబా ఆమ్టే ప్రభావంతో ఆయన 1940-44లలో పదాధికారుల శిక్షణా శిబిరానికి హాజరైనారు. 1947లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న “రాష్ట్రధర్మ” (హిందీ మాసపత్రిక), “పాంచజన్య” (హిందీ వారపత్రిక) పత్రికలు, “స్వదేశ్”, “వీర్ అర్జున్” దినపత్రికలలో పనిచేశారు.1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ పార్టీలో పనిచేయాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని ఆర్ఎస్ఎస్ నియమించింది. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కుడిభుజంగా వాజపేయి ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత వాజపేయిపై పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, లాల్ కృష్ణ అద్వానీలతో కలిసి పార్టీని జాతీయస్థాయికి ఎదిగేలా చేశారు.
రాజకీయ జీవితం:
వాజపేయి మొదటిసారి రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 3, 9 లోక్‌సభలకు మినహా 14వ లోక్ సభ వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని వాజపేయి 1980లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని ఏర్పరచారు. 1980 నుండి 1986 వరకు ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు.1996లో తొలిసారిగా ప్రధానమంత్రి అయినా.. అది 13 రోజులకే పరిమితమైంది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విఫలమై సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. దీంతో వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా 13 నెలలు పాలించారు. 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికలలో మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు కొనసాగారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 2015 మార్చి 27న వాజపేయికి ‘భారతరత్న’ ప్రదానం చేశారు.
‘అణు పరీక్షలు: 1974 లో తొలిసారి రాజస్థాన్ లోని పోఖ్రాన్ దగ్గర అణుపరీక్ష జరిపిన భారతదేశం.. మళ్ళీ 24 ఏళ్ల తరువాత 1998 మే నెలలో అదే పోఖ్రాన్ లో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. వాజపేయి ప్రభుత్వం ఏర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి.’ ‘భారత్-పాక్ సంబంధాలు: 1998 చివర్లో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్థాన్ తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్చలు ప్రారంభించారు. కార్గిల్ యుద్ధం కూడా వాజ్ పేయి హయాంలోనే జరిగింది. 2001 డిసెంబర్ 13న సాయుధ ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు.’ ‘రాజకీయ సన్యాసం:2005 డిసెంబర్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో తను క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు వాజపేయి ప్రకటించారు’.
వ్యక్తిగతం:
వాజపేయి నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయనకు భారతీయ సంగీతం, నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ అంటే ఎంతో ఇష్టం. స్వతహాగా కవి అయిన వాజ్ పేయి ఎన్నో కవితలు రాశారు. వాజ్ పేయి 2001 లో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స ముంబయి లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేయించుకున్నారు. 2009లో స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై, మాట క్షీణించింది. ఆయన ఆరోగ్యపరిస్థితి మూలంగా తరచుగా వీల్ చైర్ కు పరిమితమై, మనుషులను గుర్తించలేని స్థితికి చేరారు. ఆయన దీర్ఘకాలిక మధుమేహంతో పాటు డిమెంటియా వ్యాధితో బాధపడ్డారు.