జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర రేపటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో తిరిగి ప్రారంభం కానుంది… పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఓ సారి పర్యటనకు వెళ్లి కాలికి స్వల్పగాయంతో సమీక్షలు, సమావేశాలు, భేటీలకే పరిమితమయ్యారు. అప్పుడే మళ్లీ వస్తానని పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దిరోజులు ఉండి ఇక్కడి పరిస్థితులు
అధ్యయనం చేయాలని భీమవరంలో పర్యటించినప్పుడు పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన కోసం పవన్ కల్యాణ్ మరోసారి బుధవారం (ఆగస్ట్ 8) రాత్రికి భీమవరం చేరుకోనున్నారు. వివిధ వర్గాల ప్రజలతో అక్కడ సమావేశం కానున్నారు. జిల్లాలోని సమస్యలను అధ్యయనం చేసేందుకు కార్యాచరణ రూపొందించే అవకాశముంది.
పవన్ కల్యాణ్ నేతృత్వంలో కుల రహిత, అవినీతి రహిత రాజకీయాల కోసం చేస్తున్న పోరాటానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఉభయ గోదావరి జిల్లాల జనసేన కన్వీనర్ కల్వకొలను నాగ తులసీరావు అన్నారు. పవన్ కల్యాణ్ నాపై ఉంచిన నమ్మకంతో, విశ్వాసంతో పనిచేస్తానని అన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రధాన పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేనతో సంబంధాలు కలిగి ఉన్నారని, ఇప్పటికే పలువురు మాజీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు జనసేన పార్టీలో చేరారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి చాలామంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.