నటీనటులు: రజత్, నేహా హింగే, రాజీవ్ కనకాల, అరహన్ ఖాన్ తదితరులు
కెమెరా: రాజశేఖర్
సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
నేపథ్య సంగీతం: శ్రీ చరణ్
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-డైరెక్టర్: విజయేంద్రప్రసాద్
బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీవల్లి’. సైంటిఫిక్ ఎరోటిక్ త్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
సైంటిస్ట్ రామచంద్ర(రాజీవ్ కనకాల) కూతురు శ్రీవల్లి(నేహా హింగే)కి చిన్నప్పటినుండి తన స్నేహితుడు గౌతమ్(రజత్)తో మంచి అనుబంధం ఉంటుంది. తన తండ్రి వృత్తిరీత్యా శ్రీవల్లి తన సోదరుడు, తండ్రితో కలిసి అమెరికా వెళ్లిపోతుంది. కొంతకాలం తరువాత ఇండియాలో సైంటిఫిక్ రీసెర్చ్ ను ప్రోత్సహించాలానే ఉద్దేశంతో రామచంద్ర ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలనుకుంటాడు. దీంతో ఇండియాకు తిరిగి వస్తారు. అలా ఇండియా వచ్చిన రామచంద్ర అనుకోకుండా కార్ యాక్సిడెంట్ లో మరణిస్తాడు. శ్రీవల్లి సోదరుడు కోమాలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో శ్రీవల్లి తన ప్రొఫెసర్ చేస్తోన్న ‘బ్రెయిన్ మ్యాపింగ్’ ప్రయోగానికి అంగీకరిస్తుంది. ఈ ప్రయోగం ద్వారా మెదడులోని ఎమోషన్స్ కు, జ్ఞాపకాలకు కారణమైన ప్రధాన భాగాన్ని కనిపెట్టి దాని నుండి జనించే తరంగాల ద్వారా మరొక వ్యక్తి మెదడుకు అనుసంధానమవచ్చు. తన సోదరుడిని కోమా నుండి బయటకు తీసుకురావడానికే శ్రీవల్లి ఈ ప్రయోగానికి సిద్ధపడుతుంది. కానీ అది కాస్త వికటించి ఆమెకు గత జన్మ జ్ఞాపకాలు రావడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమె ఏది కల, ఏది నిజం అనేది గ్రహించలేకపోతుంది. ఓ ప్రమాదకర స్థితిలోకి ఆమె వెళ్లిపోతుంది. మరి చివరకు ఏమవుతుంది..? శ్రీవల్లి తన సమస్యను అధిగమిస్తుందా..? తన సోదరుడిని కాపాడుకోగలిగిందా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
దూర దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరిగురించి మరొకరు కొన్నిసార్లు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇదే ఎలా సాధ్యమవుతుందనే విషయానికి సైన్ ఏమైనా వివరణ ఇవ్వగలిగిందా అనే పాయింట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఓ వైవిధ్యమైన కథను రాసుకోవడంలో తన ప్రత్యేకతను చాటుకున్న విజయేంద్రప్రసాద్ ఆ కథను ఆశించిన రీతిలో తెరపై ఆవిష్కరించలేకపోయారు. ఆద్యంతం థ్రిల్లింగ్ సాగే ఈ కథను కాస్త తన స్క్రీన్ ప్లే తో నిరాశ పరిచాడు. తన కథనంతో మ్యాజిక్ గనుక చేయగలిగితే సినిమా మరో స్థాయిలో ఉండేది. సినిమాలో గ్రాఫిక్స్ స్కోప్ ఉన్నా… సరిగ్గా సద్వినియోగం
చేసుకోలేకపోయారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో గ్రాఫిక్స్ విలువలు పెరుగుతున్న నేపధ్యంలో ఈ సినిమాలో మాత్రం ఆ విలువలను పాటించలేకపోయారు. శ్రీవల్లి పాత్రలో నేహా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అయితే కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఆ పాత్రలో తెలిసిన హీరోయిన్ ఉండి ఉంటే ఇంకా బావుండేది. శ్రీవల్లి పాత్రకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రావడం.. ఆ జన్మలో ఆమెను ఓ వ్యక్తి ఆమెను అమితంగా ఆరాధించడం, అతడు చూపే ప్రేమకు ఆమె అనుభూతి చెందడం వంటి విషయాలను తెరపై బాగా చూపించారు. ఎప్పుడైతే శ్రీవల్లి కొన్ని విషయాలను తన స్నేహితుడితో పంచుకుంటుందో.. అప్పుడు కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.
స్నేహితుడి పాత్రలో రజత్ తన నటనతో మెప్పించాడు. రాజీవ్ కనకాల పాత్ర సినిమాలో కనిపించేది తక్కువ సమయమే అయినా.. చివరి వరకు కూడా ఆ పాత్ర ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. టెక్నికల్ గా క్వాలిటీతో సినిమాను రూపొందించారు. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ వర్క్ బాగుంది. మొత్తానికి దర్శకుడిగా విజయేంద్రప్రసాద్ విఫలమైనప్పటికీ తను చేసిన ప్రయోగాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
రేటింగ్: 2/5