పాట, మాట, సంగీతం వీటిని రూపొందించాలంటే మామూలు విషయంకాదు. పూర్తి స్థాయిలో విషయంపై అవగాహనా ఉండాలి. ఫలానా సీన్ పై కమాండ్ ఉండాలి. కవితాత్మకంగా ఆలోచించగలగాలి. అప్పుడే ఒక పాట పుడుతుంది. మంచి సంగీతం బయటకు వస్తుంది. మంచి సంభాషణలు వస్తాయి. సినిమాలు విజయవంతం అవుతాయి. ఒక పాటను సృష్టించిన రచయితకు దానిపై రాయల్టీ హక్కులు ఇవ్వాలని గత కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. వీటిపై పలుదఫాలుగా అనేకమంది రచయితలు, గాయనీగాయకులు చర్చలు జరిపారు. ఒక వస్తువును ఆవిష్కరించినపుడు దానిపై తయారీదారుడికి ఎలాగైతే పేటెంట్ హక్కులు ఉంటాయో.. కళారంగంలో ఉన్న ఆవిష్కర్తలకు కూడా రాయల్టీ హక్కులు ఉంటాయి. రాయల్టీ.. ఇది పేటెంట్ హక్కులు లాంటివి.
ఇప్పుడు తాజాగా ఈ రాయల్టీపై ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం, పలువురు గాయనీగాయకులు హాజరై రాయల్టీ విషయంపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. 2012 లో రాయల్టీ చట్టం వచ్చిందని, పాటపై నిర్మాత, సంగీత దర్శకుడు, గేయ రచయితలకు మాత్రమే హక్కులు ఉన్నాయని, కానీ గాయనీ గాయకులకు హక్కులు ఇవ్వలేదని, రాయల్టీ చట్ట ప్రకారం గాయనీగాయకులు కూడా రాయల్టీ హక్కులు ఇచ్చే విధంగా పోరాటం చేయాలనీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.