Homeతెలుగు Newsరాజకీయాలకు విజయశాంతి ఎందుకు దూరమయ్యారు?

రాజకీయాలకు విజయశాంతి ఎందుకు దూరమయ్యారు?

పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడ్డ లేడీ అమితాబ్ విజయశాంతి గత నాలుగేళ్లుగా మౌనంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా, సినిమాల పరంగా విజయశాంతి అజ్ఞాతంలో గడుపుతున్నారు. టీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించిన విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. అప్పట్లో మెదక్ ఎంపీగా పనిచేశారు. తర్వాత కాలంలో కేసీఆర్‌తో విభేదించిన విజయశాంతి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

8 25

గత ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన విజయశాంతి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి విజయశాంతి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసుల విషయంలో కోర్టుకు మాత్రం హాజరవుతున్నారు. అంతకు మించి ఎక్కడా ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొన్న దాఖలాలు లేవు.

రాజకీయాల్లో విజయశాంతి మళ్లీ క్రియాశీల పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై విజయశాంతిని వివరణ కోరగా ఇంకా సమయముంది అంటూ సమాధానం దాటవేస్తున్నారు. అంతే తప్ప తాను ఏంచేయబోతున్నారో చెప్పడం లేదు. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని విజయశాంతికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రచార కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. పార్టీలో రాములమ్మను క్రియాశీలకంగా చేసేందుకు నేతలు పెద్దగా ప్రయత్నాలు చేసినట్లు కనిపించడం లేదు.

8a 7

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించినప్పుడు విజయశాంతి జాడ కనిపించలేదు. అలాగే ఈ మధ్య రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించినప్పుడు ఆయనను కలిసేందుకు నేతలంతా ఎగబడ్డారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ సైతం హాజరయ్యారు. కానీ విజయశాంతి మాత్రం కనిపించలేదు. అయితే రాములమ్మ చరిష్మాను వచ్చే ఎన్నికల్లో వాడుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ పెద్దలు విజయశాంతితో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆమెకు ఎలాంటి పదవి లేకపోవడమూ పార్టీకి దూరంగా ఉండేందుకు కారణంగా భావించవచ్చు. పార్టీలో ఆమెకు ఏదైనా పదవి ఇచ్చి గౌరవిస్తే కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. ఆమె మెదక్ లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతున్నట్లు సమాచారం. ఆమె మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారని ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu