దేశ సరిహద్దుల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు మేజర్ రవి మలయాళంలో “1971 బియాండ్ బార్డర్స్” తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నటించారు. గతేడాది మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులో “యుద్ధభూమి” పేరుతో అనువాదం చేస్తున్నారు జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్లపై ఏఎన్ బాలాజీ. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మేజర్ రవి నిజ జీవితంలో కూడా మేజర్ కావడం విశేషం. 1981లో ఆర్మీలో చేరి అనేక కీలక ఆపరేషన్లు లీడ్ చేసారట. మేజర్ రవి తొలిసారి 2002లో పునర్ జని అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తన దేశభక్తిని నిరూపిస్తూ యథార్థ సంఘటనల ఆధారంగా అనేక చిత్రాలకు దర్శకత్వం చేశారు. మేజర్ రవి ప్రతి సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంగీతం సిద్ధార్థ విపిన్. ఈ సినిమాలో అల్లు శిరీష్ యంగ్ అండ్ డైనమిక్ సోల్జర్‌గా కనిపిస్తారు. మోహన్‌లాల్ మేజర్‌గా నటించారు. ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని నమ్మకముందని నిర్మాత ఏఎన్ బాలాజీ అన్నారు.