పచ్చపాలనలో జరిగిన స్వాహాయణం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. పేద రోగులకు ఆర్థిక అండనివ్వాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధినే స్వాహా చేశారు. సాయం చేసి ప్రాణం పోయాల్సిన వారే కమీషన్లు పేరుతో ఆ నిధుల్ని పచ్చ జేబుల్లో వేసుకుని యమభటులుగా మారిన బండారం బయటపడింది.
పెండింగ్‌లో 22 వేల ఫైల్స్, 8700 చెక్కులు బౌన్స్
ఆస్పత్రిలో చికిత్స కోసం పేదలు పెట్టుకున్న విజ్ఞాపనలను సైతం పచ్చ పాలనలో చూసే పరిస్థితి లేదు. 22 వేలకుపైగా ఫైళ్లను మూలన పడేశారు. సాయం చేసిన వారికి నామాలు పెట్టేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఇచ్చిన 8700 చెక్కులు బౌన్స్ అయ్యాయంటే ఏ రకంగా పాలన సాగిందో అర్థం చేసుకోవచ్చు. పేదలకే కాదు… వైద్యం చేసిన ఆసుపత్రులకు 2017 నుంచి వందల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టారు. తమకు కావాల్సిన ఆసుపత్రులకు మాత్రం అడ్డగోలుగా చెల్లించారు.
ఎల్వోసీలు, రియంబర్స్ మెంట మంజూరు చేయడంలో రాజకీయ, కుల వివక్షకు పాల్పడ్డారు. 80 శాతం సహాయ నిధిని కేవలం కొద్దిమంది పచ్చ ఎమ్మెల్యేలు, వారి అనుకూల ఆస్పత్రులు దోచుకున్నాయి. ఈ అవినీతిని దందా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగానే సాగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో వివిధ సంస్థలు, ప్రజల నుండి సేకరించిన విరాళాలు ఏమయ్యాయో దేవునికే ఎరుక. వెరసి పటిష్టమైన బ్రోకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరి ముఖ్యమంత్రి సహాయ నిధిని భోంచేశారు. అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ఆసుపత్రులు కుమ్ముకై పేదల సొమ్మును పందికొక్కుల్లా మింగేశారు.
జగన్ సీఎం అయ్యాక ముఖ్యమంత్రి సహాయనిధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్రమాలకు ఒక్కొక్కటిగా తెరదించుతున్నారు. సమర్ధులైన నిజాయితీపరులైన అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ప్రతి పైసా పేదవారికి చెందాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు పక్కాగా అమలవుతున్నాయి.
డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో పక్కాగా సాయం
ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ, సిబ్బంది ఆచితూచి వ్యవహరిస్తూ, ప్రతి పైసా సద్వినియోగానికి కృషి చేస్తున్నారు. గతంలో జరిగిన అక్రమాలను అరికట్టడానికి పాత బ్యాంక్ అకౌంట్ మూసివేశారు. కొత్త అకౌంట్‌ని ప్రారంభించారు. బ్రోకర్ల వ్యవస్థను అరికట్టడానికి నేరుగా రోగుల బంధువులకే ఎల్వోసీలను ఇస్తున్నారు. లంచాలు, కమిషన్ల తీసుకున్నవారిపై, బ్రోకర్ల పై ఉక్కు పాదం మోపుతున్నారు. దొంగబిల్లులు పెడుతున్న వ్యక్తులపై , ఆసుపత్రులపై పోలీసు కేసులు కూడా పెడుతున్నారు. సిబ్బందిపై కూడా చర్యలకు వెనకాడటం లేదు. దృష్టి కి వచ్చిన అక్రమాలన్నీ ఎప్పటికప్పుడు విజిలెన్స్ వారికి పంపుతున్నారు. మరోవైపు రోగులు ఇబ్బంది పడకుండా, ఏ రోజు ఎల్వోసీ లను అదే రోజు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైన వాటికి మానవతా దృక్పథంతో సెలవు రోజుల్లోనూ ఎల్వోసీ లను మంజూరు చేస్తున్నారు. పేద రోగులకు సరైన ఆసుపత్రులను, మంచి వైద్యులను సైతం సూచిస్తుండడం విశేషం.
క్షణాల్లో క్లియరెన్స్
కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 2421 ఎల్వోసీలను, 2749 మెడికల్ రీయంబర్సుమెంట్లు, 21 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలుపుకొని మొత్తం 5,191 దరఖాస్తులను పరిశీలించారు. దాదాపు 52 కోట్లు మంజూరు చేయడం విశేషం. ఈ ప్రక్షాళన చర్యల్లో రియంబర్సుమెంట్లు కాస్త ఆలస్యమైనా, ఎల్వోసీలను సత్వరం మంజూరు చేస్తున్నారు.