పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. ఒకరికొకరు తెలిసినా బంగారం సినిమా తర్వాతే వీరిద్దరూ తరచూ కలిసేవారట. ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకునే వారట. వీరిద్దరి అభిప్రాయాలూ దాదాపు ఒక్కటే. సాధారణంగా ఎవరైనా దర్శకులు వచ్చి కథ చెప్పినప్పుడు శ్రద్ధగా వింటారు. అయితే ఓ రోజు పవన్ దగ్గరకు దర్శకుడు త్రివిక్రమ్ వెళ్లి కథ చెబుతుంటే పవన్ నిద్రలోకి జారుకున్నాడట. కథ అంతా అయిపోయాక త్రివిక్రమ్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడట. మరో దర్శకుడైతే నన్ను తిట్టుకునే వాడు అని పవన్ ఓ సందర్భంలో చెప్పారు. ఇంతకూ ఆ కథ మహేష్‌బాబుతో తీసి హిట్ కొట్టిన అతడు సినిమా కథ. ఆ కథతో సినిమా చేయలేకపోయా ఆ తర్వాత మా కాంబినేషన్‌లో జల్సా వచ్చిందని అన్నారు. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే కొద్దిసేపయినా చూస్తానని పవన్ అంటున్నారు.
పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కోబలి పేరుతో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా మొదలైంది? అది ఎలా రూపాంతరం చెందిందనే అంశంపై త్రివిక్రమ్ స్టడీ చేసి కథను తయారు చేసుకున్నాడట. కథ దాదాపు పూర్తి చేసినా పాటలు లేకుండా గంటా 45 నిమిషాల పాటు సినిమా పూర్తి చేయాలనుకున్నారట. 2014 ఎన్నికలు రావడంతో మరో ఏడాదిపాటు సినిమాలు చేయనని పవన్ చెప్పడంతో సినిమా పక్కన పెట్టేశారట. వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత మళ్లీ సినిమాలు చేస్తే అప్పుడు కోబలి పూర్తిచేసే యోచనలో ఉన్నట్టు త్రివిక్రమ్ చెబుతున్నారు.