బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్ తర్వాత మధ్యాహ్నం ముంబయిలోని తాజ్ పాలెస్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు. ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని తాను విజన్ రూపొందించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2050 నాటికి ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్‌గా ఉండాలన్నది తమ లక్ష్యమని.. దానికనుగుణంగా గడచిన నాలుగేళ్లుగా ఏపీ వృద్ధి నమోదు చేస్తోందన్నారు. దీనిపై ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ వరుసగా అగ్రస్థానంలో ఉందన్నారు. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్, బెంగుళూరు- చెన్నై కారిడార్, కర్నూలు- చెన్నై కారిడార్ ఇలా వేర్వేరు ఉత్పత్తి నోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్, హెల్త్, పర్యాటక, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విధానాలు ఉన్నాయని, అభివృద్ధి చేసిన భూ బ్యాంకు అందుబాటులో ఉందని పారిశ్రామిక వేత్తలకు సీఎం తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.